సర్ ప్రక్రియలో అక్రమాలకు అవకాశం ఇవ్వొద్దు..!
ABN , Publish Date - May 16 , 2026 | 04:22 AM
రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-సర్) ప్రక్రియలో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని టీపీసీసీ....
ఇతర రాష్ట్రాల్లో మాదిరి జాబితాలను తప్పుల తడక చేయొద్దు
ఇప్పట్లో ఎన్నికల్లేవు కాబట్టి ఏడాదిన్నర పాటు చేపట్టండి..
సీఈవోను కలిసిన మహేశ్‌గౌడ్, పొన్నం, కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-సర్) ప్రక్రియలో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలతో ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డిని శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియలో భాగంగా పలుచోట్ల జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో పారదర్శకంగా చేపట్టాలని కోరుతూ 22 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సీఈవోకు సమర్పించారు. అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ వల్లే బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు మారాయని, గెలవాల్సిన పార్టీలు ఓడిపోయాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ‘సర్’ పేరిట ఓటర్ల జాబితాను తప్పుల తడకగా మార్చొద్దని సీఈవోను కోరినట్లు తెలిపారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో 3 నెలల పాటు సర్ ప్రక్రియ జరిగింది. 25 ఏళ్లలో తెలంగాణలో ఓటర్ల సంఖ్య దాదాపు 1.2 కోట్లు పెరిగి ప్రస్తుతం 3.35 కోట్లకు చేరింది. ఇంతటి భారీ ప్రక్రియను 2-3 నెలల్లో తొందరగా ముగించొద్దు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేనందున ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలి. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వోలు) 3-4 సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయాలి. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల ఇంగ్లిష్ చదవడం, రాయడం రాని వారిని బీఎల్‌వోలుగా నియమించడం సరికాదు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 2002, 2025 ఓటర్ల జాబితాలను 48 గంటల్లోగా అందించాలి. గత 20 ఏళ్లలో వలస వచ్చి ఇక్కడ రెండు ఎన్నికల్లో ఓటేసిన వారికి అఫిడవిట్ ఆధారంగా ఓటు హక్కును కొనసాగించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పౌరసత్వ రుజువులను డిమాండ్ చేయకూడదు. మరణించారు, వలస వెళ్లారనే తప్పుడు నెపంతో ఫారం 7 ద్వారా బల్క్ (ఎక్కువ సంఖ్యలో) ఓట్ల తొలగింపు దరఖాస్తులపై కఠిన నిఘా ఉంచాలి.’ అని సీఈవోను కోరినట్లు వివరించారు.