తేజస్వీ సూర్య వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:44 AM
తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్..
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కాంగ్రెస్ ఎంపీల వినతి
పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసన
కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలంటూ పొన్నం విజ్ఞప్తి
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కాంగ్రెస్ ఎంపీలు వినతిపత్రం అందజేశారు. దీనిపై పరిశీలించి తొలగిస్తామని స్పీకర్ హామీనిచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. తొలుత.. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకొని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తేజస్వీ సూర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మకరద్వారం మెట్లపై ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఆర్.రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి వివేక్ వెంకటస్వామి నిరసన తెలిపారు. ‘తెలంగాణతో బీజేపీ రాజకీయాలు వద్దు.. అమరుల త్యాగాలను హేళన చేయొద్దు, తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. తేజస్వి మాటలను పార్లమెంట్ రికార్డుల నుండి తొలగించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తేజస్వి తప్పు చేసినట్లుగా కిషన్‌రెడ్డి ఒప్పుకున్న నేపథ్యంలో ఆయనకు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ విషం కక్కుతోందని, తాజాగా ఆ పార్టీ ఎంపీ కాలకూట విషాన్నే చిమ్మాడని ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఈ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే.. కిషన్‌రెడ్డి చేయకుండా పారిపోయారన్నారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను తేజస్వి అవమానిస్తుంటే రాష్ట్ర బీజేపీ ఎంపీలు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణను అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు పుట్టగతులు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.
గాంధీభవన్‌లో తేజస్వి దిష్టిబొమ్మ దహనం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా ‘ఖబడ్దార్.. తేజస్వి సూర్య’ అంటూ నినాదాలు చేశారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డితో పలువురు నేతలు పాల్గొన్నారు.