Share News

తెలంగాణలో బీజేపీకి చోటు లేదు!

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:28 AM

మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసిన బీజేపీని ప్రజలు నమ్మలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణలో బీజేపీకి చోటు లేదు!

  • మా పాలనకు మునిసి‘పోల్స్‌’ ఫలితాలే రెఫరెండం: ఉత్తమ్‌

  • అభివృద్ధి కోసమే ఆ పార్టీల మద్దతు తీసుకున్నాం: మహేశ్‌ గౌడ్‌

నిజామాబాద్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసిన బీజేపీని ప్రజలు నమ్మలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ పార్టీకి చోటు లేదని తేలిపోయిందని.. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు ముమ్మాటికీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని.. ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇచ్చిన స్పష్టమైన తీర్పు అని అన్నారు. బీజేపీ మత రాజకీయాలకు ప్రజలు చెక్‌పెట్టారని, ఇక్కడి ప్రజలు లౌకికవాదాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 90 శాతానికి పైగా మునిసిపాలిటీలు కాంగ్రెస్‌ గెలుచుకుందని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. మతతత్వ రాజకీయాలతో ప్రజలను విభజించేందుకు బీజేపీ చేస్తున్న రాజకీయాలకు చెక్‌పెట్టేందుకే కాంగ్రెస్‌ ఎంఐఎంతో పొత్తుపెట్టుకుందన్నారు. మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలన్నారు. అభివృద్ధి కోసమే ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ల మద్దతు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో తీసుకున్నామని చెప్పారు. సామాన్య మహిళకు మేయర్‌ పదవి ఇచ్చిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందన్నారు. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలను కాంగ్రెస్‌ గెలుచుకుందని.. వాటిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. మతాలను, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూసిన బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.

బీజేపీకి కేసీఆర్‌ పరోక్ష మద్దతు: చనగాని

కాళేశ్వరం అవినీతికి మద్దతు ఇచ్చినందుకు కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బీజేపీకి కేసీఆర్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్‌ ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌.. పరోక్షంగా బీజేపీకి మద్దతునిచ్చిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు ఒకటే అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 07:28 AM