Share News

జగిత్యాలలో కుర్చీ జగడం!

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:32 AM

జగిత్యాల మునిసిపల్‌ కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను సాధించినప్పటికీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా వర్గపోరు జోరుగా జరుగుతోంది.

జగిత్యాలలో కుర్చీ జగడం!

  • రెండుగా చీలిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

  • ఎమ్మెల్యే సంజయ్‌, మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రం

  • వేర్వేరుగా క్యాంపులకు 2 వర్గాల కౌన్సిలర్లు

జగిత్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మునిసిపల్‌ కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను సాధించినప్పటికీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా వర్గపోరు జోరుగా జరుగుతోంది. జగిత్యాలలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రెండుగా చీలిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరి సంజయ్‌ కుమార్‌ వర్గానికి చెందిన కౌన్సిలర్లు, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా జగిత్యాల మునిసిపాలిటీలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక రాజకీయం రసకందాయంలో మారింది. సంజయ్‌ వర్గీయులు క్యాంపునకు తరలివెళ్లారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 26కు అవసరమైన కౌన్సిలర్లతో క్యాంపునకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్‌, హైదరాబాద్‌లోని రహస్య ప్రాంతాల్లో ఎమ్మెల్యే సంజయ్‌ వర్గీయులు క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్‌రెడ్డి వర్గం నుంచి కాంగ్రెస్‌ బీఫామ్‌పై పోటీచేసి విజయం సాధించిన 14 మంది కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. అయితే హైదరాబాద్‌లోని క్యాంపులో మరో నలుగురు కౌన్సిలర్లు జీవన్‌రెడ్డి క్యాంపులో చేరతారని అంటున్నారు. జగిత్యాల మునిసిపాలిటీలో 50 వార్డులు ఉండగా.. కాంగ్రెస్‌ 23, బీజేపీ 6, బీఆర్‌ఎస్‌ 4, మజ్లిస్‌ 2 స్థానాలు సాధించాయి. స్వతంత్రులు 15 మంది విజయం సాధించారు. స్వతంత్ర కౌన్సిలర్లలో ముగ్గురు బీజేపీ రెబెల్స్‌ కాగా, 10 మంది జీవన్‌రెడ్డి అనచరులు, ఇద్దరు సంజయ్‌ అనుచరులున్నారు. కాంగ్రెస్‌ బీఫామ్‌పై పోటీ చేసి గెలిచిన 23 మంది కౌన్సిలర్లలో ఏడుగురు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులు, 16 మంది సంజయ్‌ వర్గీయులున్నారు. మజ్లిస్‌, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ లోని రెండువర్గాలు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవిని చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు సఫలీకృతం అవుతాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.


మెట్‌పల్లి, రాయ్‌కల్‌లో ఉత్కంఠ

జిల్లాలోని మెట్‌పల్లి మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కోరుట్ల కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ్‌రావు సూచనలతో ఆరుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ సలహాతో ఆరుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దిశానిర్దేశంతో 10 మంది బీజేపీ కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నాయి. మెట్‌పల్లిలో 26 మంది కౌన్సిలర్లకుగాను మ్యాజిక్‌ ఫిగర్‌ 14ను ఏ పార్టీ దక్కించుకోలేకపోయింది. మెట్‌పల్లిలో 10 బీజేపీ, 6 బీఆర్‌ఎస్‌, 6 కాంగ్రెస్‌, 4 స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎ్‌సతో గానీ స్వతంత్రులతో గానీ జతకట్టి బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందన్న అంచనాలున్నాయి. కాగా రాయికల్‌ మునిపాలిటీలోని 12 స్థానాల్లో 3 కాంగ్రెస్‌, 5 బీజేపీ, 3 బీఆర్‌ఎస్‌ దక్కించుకున్నాయి. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన ఏడు స్థానాలు ఏ పార్టీకీ రాలేదు. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌.. స్వతంత్రుల మద్దతుతో బీజేపీ చైర్మన్‌ సీటును కైవసం చేసుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదేసమయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కూడా అంతర్గత ఒప్పందం కుదుర్చుకొని చైర్మన్‌ స్థానాన్ని చేజిక్కించుకుంటాయని మరో ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 15 , 2026 | 07:32 AM