మునిసిపల్ ఎన్నికల్లో మాదే గెలుపు
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:08 AM
రాష్ట్రంలో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
90 శాతం స్థానాలు మావే
ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని గమనిస్తే, సుమారు 90 శాతం పైగా స్థానాల్లో తమ పార్టీ ఆధిక్యం సాధించబోతోందని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఓటర్లు పట్టం కట్టారని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కనిపిస్తున్న వేగం, పరిపాలనలో పారదర్శకత ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత పెంచాయని విశ్లేషించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని ఆయన వివరించారు. మునిసిపాలిటీల్లో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓటర్లలో సానుకూల భావనను కలిగించాయని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ప్రతిపక్షాలు చేసిన అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులకు, అభ్యర్థులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.