Share News

మళ్లీ కాంగ్రెస్‌ పార్టీదే అధికారం: మహేశ్‌గౌడ్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:09 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీదే మళ్లీ అధికారం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలైందన్నారు.

మళ్లీ కాంగ్రెస్‌ పార్టీదే అధికారం: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీదే మళ్లీ అధికారం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలైందన్నారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేదన్నారు. గాంధీ భవన్‌లో గురువారం జరిగిన టీపీసీసీ ఎస్‌సీ సెల్‌ చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మహేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లతో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌కు క్లిష్ట సమయాల్లో దళితులు అండగా నిలబడ్డారని, రాబోయే పదవుల పంపకాల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తుల్లో ఎస్సీల తరపున కవ్వంపల్లి సూచించిన వారికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ తనకు మంత్రిపదవి రావడానికి మందుల సామేలే కారణమన్నారు. మాదిగ ఎమ్మెల్యేలనందరినీ ఢిల్లీకి తీసుకెళ్లింది ఆయనేనన్నారు. ఈ విషయమై తలెత్తిన ఇబ్బందిని సంపత్‌కుమార్‌ పరిష్కరించారని చెప్పుకొచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎస్సీల సమస్యలను సర్కారు దృష్టికి తేవాలని కవ్వంపల్లిని కోరారు. దేశ ఐక్యతకు పాటు పడేది కాంగ్రెస్‌ మాత్రమేనని చెప్పారు.

Updated Date - Mar 13 , 2026 | 05:09 AM