Share News

కాంగ్రెస్‌, బీజేపీ.. ఢీ అంటే ఢీ

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:49 AM

నీట్‌ నిరసనల సెగ.. కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర కార్యాలయాలకూ తాకింది. ఆయా పార్టీల నేతలు పరస్పరం పార్టీల రాష్ట్ర కార్యాలయాలను ముట్టడికి దిగడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

కాంగ్రెస్‌, బీజేపీ.. ఢీ అంటే ఢీ

  • పరస్పరం పార్టీ కార్యాలయాల ముట్టడి

  • తొలుత గాంధీభవన్‌కు వెళ్లిన బీజేపీ నేతలు

  • ఫ్లెక్సీలు చించివేస్తుండగా అడ్డుకున్న పోలీసులు

  • ప్రతిగా బీజేపీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్‌ యత్నం

  • తిరిగి వారిని వెంబడించిన కమలం నాయకులు

  • కొట్టుకున్న ఇరువర్గాలు.. కర్రలు, రాళ్లతో హంగామా

  • టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్‌ భవన్‌.. తీవ్ర ఉద్రిక్తం

  • ఢిల్లీలో యువతపై లాఠీచార్జి, రాహుల్‌గాంధీ అరెస్టును

  • నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలు

  • కరీంనగర్‌లో సంజయ్‌ కార్యాలయ ముట్టడికి యత్నం

  • చెప్పులు, కుర్చీలు విసురుకున్న ఇరు పార్టీల నాయకులు

  • ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్‌ చేయాల్సిందే: మహేశ్‌గౌడ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నీట్‌ నిరసనల సెగ.. కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర కార్యాలయాలకూ తాకింది. ఆయా పార్టీల నేతలు పరస్పరం పార్టీల రాష్ట్ర కార్యాలయాలను ముట్టడికి దిగడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోటాపోటీ నిరసనలు, నినాదాలతో హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతం హోరెత్తింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. మీరెంత అంటే మీరెంత అన్నట్లుగా ఒకరిపైకి మరొకరు దూసుకుపోయారు. ఒకానొక దశలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. నీట్‌ పేపర్‌ లీకేజీపై ఢిల్లీలో యువతపై లాఠీచార్జి, రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన చలో లోక్‌ భవన్‌ కార్యక్రమంలోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోక్‌భవన్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా.. తోపులాట చోటు చేసుకుంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ నిరసనలు హోరెత్తాయి. బుధవారం ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకు ధర్నాలు, నిరసనలు, అరెస్టులతో రాష్ట్రం అట్టుడికింది. ఏఐసీసీ పిలుపు మేరకు టీసీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చలో లోక్‌భవన్‌ కార్యక్రమం జరిగింది.


ఇదే సమయంలో రాహుల్‌గాంధీ తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా గాంధీభవన్‌ ముట్టడికి వెళ్లి.. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. రాంచందర్‌రావుతో సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బీజేపీ నేతల గాంధీభవన్‌ ముట్టడికి సమాధానంగా ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు కర్రలు చేతపట్టుకొని కాంగ్రెస్‌ నాయకులను ఎదుర్కొనేందుకు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు కర్రలు చూపుకుంటూ, తొడలు కొట్టుకుంటూ సవాళ్లు విసురుకున్నారు. అనంతరం కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగడంతో అరగంట పాటు ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ గందరగోళంలో ఓ మీడియా చానల్‌ ప్రతినిధికి గాయం కాగా, సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. వెంకట్‌ సహా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని, చిక్కడపల్లి పీఎ్‌సకు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం వెంకట్‌ బల్మూర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు కూడా అహింస మార్గం వదిలి తిరగబడితే....బీజేపీ నేతలు రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు. అనంతరం గాంధీభవన్‌, బీజేపీ కార్యాలయాల వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి లోనికి అనుమతించారు.


చలో లోక్‌భవన్‌.. నేతల అరెస్టు

ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ నేతృత్వంలో చేపట్టిన చలో లోక్‌భవన్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా తొలుత నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యనాయకులు చేరుకున్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. అక్కడి నుంచి లోక్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ధర్మేంద ప్రధాన్‌ను బర్తరఫ్‌ చేయాలన్న నినాదంతో లోక్‌భవన్‌ రోడ్డు దద్దరిల్లింది. బ్యారికేడ్లను దాటుకొని లోక్‌భవన్‌లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ నాయకులు యత్నించడంతో.. తీవ్ర గందరగోళం నెలకొంది. అడ్డుకున్న పోలీసులతో నాయకులు వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటు చేసుకుంది. చివరకు మహేశ్‌గౌడ్‌, పొంగులేటి, దామోదర, వెంకట్‌ బల్మూర్‌ తదితర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని, వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యుడిని చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతపై లాఠీచార్జ్‌, రాహల్‌, ప్రియాంక గాంధీల అరెస్టు.. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. యువత భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు.


జిల్లాల్లోనూ ధర్నాలు, ఆందోళనలు

హనుమకొండలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ మోదీది ఆరాచక ప్రభుత్వమని దుయ్యబట్టారు. నీట్‌ పేపర్‌ లీకేజీని ప్రశ్నిస్తూ విద్యార్థులు చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలోనే సాగిందని, దీన్ని జీర్ణించుకోలేని మోదీ ప్రభుత్వం విద్యార్థులపై దౌర్జన్యం చేసిందని మండిపడ్డారు. ఆడపిల్లలని కూడా చూడకుండా లాఠీలతో కొట్టడం అమానుషమని ధ్వజమెత్తారు.ఖమ్మంలో మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులను మోసగించిన కేంద్ర ప్రభుత్వంపై యువత పగ తీర్చుకోవడం ఖాయమని, బీజేపీ పోకడలే ఆ పార్టీ పతనానికి నాంది పలుకుతాయన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చర్లపటేల్‌గూడలోని మహాత్మ జ్యోతిరావ్‌ పూలే క్యాంప్‌సలో నీట్‌ పేపర్‌ లీకేజీపై యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో విద్యార్థుల గొంతుక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మోదీ 12 ఏళ్ల పాలనలో 152 పేపర్‌ లీక్‌లు జరిగాయన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు.


బండి సంజయ్‌ కార్యాలయ ముట్టడి..

రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. తొలుత మహాత్మ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ నాయకులు.. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. అక్కడి నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర నాయకులు బండి సంజయ్‌ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించి నిరసన చేపట్టగా.. బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు చెప్పులు, కుర్చీలు విసురుకున్నారు. దీంతో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బీజేపీ నాయకులు డీసీసీ కార్యాలయం ముట్టడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, పెద్దపల్లిలో ప్రభుత్వ విప్‌ విజయరమణరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పొన్నం మాట్లాడుతూ నీట్‌ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 23 , 2026 | 05:51 AM