హంగ్‌లో కింగ్ కావాలని!
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:47 AM
పుర పోరు ఫలితాల్లో హంగ్ ఏర్పడిన మునిసిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తీవ్ర ప్రయత్నాలు
24 మునిసిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం పావులు
కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు దక్కించుకునే అవకాశాలు
ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి పెరుగుతున్న బలం
పలు చోట్ల పోటాపోటీగా ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్
బెల్లంపల్లిలో కాంగ్రెస్ సభ్యుల కోసం రివర్స్ ఆపరేషన్
రేపే మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పుర పోరు ఫలితాల్లో హంగ్ ఏర్పడిన మునిసిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందుకోసం స్వతంత్రులుగా గెలిచిన వారిని తమ శిబిరంలో చేర్చుకోవడంతోపాటు ప్రత్యర్థి పార్టీల్లోని కౌన్సిలర్లను కూడా తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడా తక్కువ సంఖ్యలో వార్డులను గెలుపొందిన బీజేపీకి కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎర వేస్తున్నాయి. ఈ సమీకరణాలు ఎక్కువగా కాంగ్రె్‌సకు అనుకూలంగా కనిపిస్తుండగా.. బీఆర్‌ఎస్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బెల్లంపల్లి వంటి చోట్ల ఏకంగా కాంగ్రెస్ కౌన్సిలర్‌ను కూడా తమ క్యాంపులోకి లాగేసుకుంది. అయితే ఎంఐఎం, ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి అత్యధిక స్థానాలను దక్కించుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని 24 మునిసిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. తమ సభ్యులను శిబిరాలకు తరలించి.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే 16వ తేదీ వరకు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డిలో ఉత్కంఠ..
అలియాబాద్ మునిసిపాలిటీలో 20 వార్డులకుగాను 8 గెలుపొందిన కాంగ్రెస్, 7 వార్డులు గెలుచుకున్న బీఆర్‌ఎస్.. చైర్మన్ పదవికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ 3 వార్డులను బీజేపీ, రెండు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇద్దరు స్వతంత్రులు ఇప్పటికే కాంగ్రె్‌సకు మద్దతు పలకగా.. మ్యాజిక్ ఫిగర్‌ను చేరేందుకు మరో ఓటు అవసరం ఉంది. దీంతో ఎక్స్ అషీషియో ఓటు ద్వారా చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఎల్లంపేటలో 24 వార్డులకుగాను 12 వార్డులను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు మరో ఓటు అవసరం ఉంది. ఇక్కడ మూడు వార్డులు గెలిచిన బీజేపీ సహకరిస్తే బీఆర్‌ఎస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 8 వార్డులు గెలుపొందిన కాంగ్రెస్ కూడా ఈ మునిసిపాలిటీని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆమన్‌గల్ మునిసిపాలిటీలో 15 వార్డులకుగాను బీఆర్‌ఎస్ 8 వార్డులు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించినా చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఒక్క వార్డులో మాత్రమే గెలిచిన కాంగ్రెస్.. బీజేపీ(6)తో కలిసి బీఆర్‌ఎ్‌సను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, మెయినాబాద్ మునిసిపాలిటీలో 26 వార్డులకుగాను 10 గెలుచుకున్న కాంగ్రెస్.. స్వతంత్రులుగా గెలిచిన ఐదుగురి నుంచి ముగ్గురిని తమ శిబిరంలో చేర్చుకుంది. స్థానిక ఎమ్మెల్యే యాదయ్య ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. పరిగి మునిసిపాలిటీలో 18 వార్డులకుగాను కాంగ్రె్‌సకు 8 వార్డులు దక్కగా.. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఒకరు హస్తం గూటికి చేరారు. మరొకరు కూడా చేరే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే రామ్మెహన్‌రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది.
ఉమ్మడి పాలమూరులో హైడ్రామా..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. అలంపూర్ మునిసిపాలిటీలోని 10 వార్డులకుగాను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ చెరో 5 గెలుపొందాయి. ఇక్కడ బీఆర్‌ఎ్‌సకు ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి రూపంలో రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు దక్కనున్నాయి. తామిద్దరం ఓటు నమోదు చేసుకున్నామని ఎమ్మెల్యే విజేయుడు చెబుతుండగా.. అలంపూర్ కమిషనర్ మాత్రం ఎవరూ నమోదు చేసుకోలేదని అంటున్నారు. ఇక నారాయణపేట మునిసిపాలిటీలో 24 వార్డులకుగాను 11 వార్డుల్లో బీజేపీ, ఏడు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందాయి. బీఆర్‌ఎస్, ఎంఐఎం రెండు చొప్పున, ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కటి గెలిచారు. ఇండిపెండెంట్లలో ఒకరు బీజేపీలో చేరగా, ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటు ఆ పార్టీకి ఉంది. మరోవైపు కాంగ్రె్‌సకు ఇద్దరు ఎంఐఎంతోపాటు ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు మద్దతు తెలపడంతో హస్తం బలం 10కి చేరింది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓటుతో 11 కానుంది. బీఆర్‌ఎస్ సభ్యులు తమకు మద్దతు తెలుపుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రె్‌సలకు సమానంగా (13) ఓట్లు రానుండడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. గద్వాలలో మొత్తం 37 వార్డులకుగాను కాంగ్రెస్ 16 వార్డులు, బీఆర్‌ఎస్ 11 వార్డులు, బీజేపీ 7 వార్డులు గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, ఒక ఎంఐఎం సభ్యుడు, ఇద్దరు స్వతంత్రులు కాంగ్రె్‌సతోనే ఉన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కూడా ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఓటు కూడా కలుపుకొంటే బలం 20కి చేరవచ్చు. కానీ, ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చర్చలు నడుస్తున్నాయి. వారిద్దరివి కలుపుకొంటే 18 ఓట్లవుతాయి. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీల మద్దతు ఉంది. కానీ... వారు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఇక్కడ ఉత్కంఠ వీడటం లేదు. ఇక అమరచింత మునిసిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రె్‌సకు తలా మూడు చొప్పున గెలుచుకున్నాయి. మరో అభర్థి కాంగ్రెస్ మద్దతుతోనే సీపీఎం తరఫున గెలిచారు. స్థానిక ఎమ్మెల్యే కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటే కాంగ్రెస్ బలం 5కు చేరుతుంది. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీకి చెరో మూడు ఓట్లు ఉండటంతో రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రసవత్తరం..
ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఐదు మునిసిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. నర్సాపూర్ మునిసిపాలిటీలో 15 వార్డులకుగాను కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 4 చోట్ల విజయం సాధించాయి. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుతో బీఆర్‌ఎస్ సంఖ్య కూడా 6కు చేరింది. అయితే బీజేపీలో ఒక అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవి ఇస్తామని ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ ఆఫర్ ఇచ్చాయి. కానీ, తమకు చైర్మన్ పదవి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. మెదక్ మునిసిపాలిటీలో 32 స్థానాలకుగాను బీఆర్‌ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2 స్థానాలు దక్కించుకున్నాయి. బీఎస్పీ తరఫున గెలిచిన ఒక అభ్యర్థి కాంగ్రె్‌సలో చేరారు. మరోవైపు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎక్స్‌అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 16కు పెరగనుంది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ వైస్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ సైతం ఇదే హామీ ఇవ్వడంతో.. ఇద్దరు బీజేపీ అభ్యర్థుల నిర్ణయంపైనే ఫలితం ఆధారపడి ఉంది. కాగా, ఇస్నాపూర్ మునిసిపాలిటీ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ 26 వార్డులకుగాను బీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 10 వార్డులు గెలిచాయి. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్‌ఎస్ బలం 13కు చేరనుంది. కాంగ్రె్‌సకు ఇప్పటికే 10 మంది ఉండగా.. నలుగురు స్వతంత్రులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. వారికోసం బీఆర్‌ఎస్ కూడా ప్రయత్నిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక జిన్నారం మునిసిపాలిటీలోని 20 వార్డులకుగాను బీఆర్‌ఎ్‌సకు 8, కాంగ్రె్‌సకు 6 గెలిచారు. దీంతో రెండు పార్టీలూ 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ మునిసిపాలిటీలోని 37 సీట్లకు కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 15 స్థానాల్లో విజయం సాధించాయి. పాలకవర్గం ఏర్పాటు చేయాలంటే 19 సీట్లు అవసరం కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఎక్స్ అఫీషియో ఓటును నమోదు చేసుకున్నారు. బీజేపీ (3) మద్దతు కూడగట్టుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు సైతం ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు, ముగ్గురు స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు.
ప్రతిపక్ష శిబిరంపై గురి..
బోధన్ మునిసిపాలిటీలోని 38 వార్డులకుగాను కాంగ్రెస్ పార్టీ 17, ఎంఐఎం 12, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 3 వార్డులలో గెలుపొందాయి. మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, ఒక ఇండిపెండెంట్, మరో బీఆర్‌ఎస్ సభ్యుడు కాంగ్రెస్ క్యాంప్‌లో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటును నమోదు చేసుకున్నారు. దీంతో చైర్మన్ కాంగ్రె్‌సకే దక్కే అవకాశాలున్నాయి. కామారెడ్డి మునిసిపాలిటీలోని 49 వార్డులకు కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్‌ఎస్ 11 వార్డుల్లో గెలుపొందాయి. స్వతంత్రులుగా గెలిచిన ముగ్గురూ కాంగ్రె్‌సలో చేరారు. దీంతో మ్యాజిక్‌ఫిగర్ చేరువలో కాంగ్రెస్ ఉంది. మరో ముగ్గురి మద్దతు కావాల్సి ఉండడంతో విపక్షంలోని వారితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మునిసిపాలిటీలో 34 వార్డులుండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో 14 గెలుచుకున్నాయి. దీంతో ఎమ్మెల్యే వినోద్ ఇండిపెండెంట్లుగా గెలిచిన ఐదుగురిని తనవైపు తిప్పుకొనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే నలుగురితో క్యాంపు ఏర్పాట్లు చేయడంతో కాంగ్రెస్ సంఖ్య 18కి చేరిందని భావిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ రివర్స్ ఆపరేషన్ చేపట్టి.. ఇద్దరిని తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఆ పార్టీ బలం 16కు చేరింది. ఎమ్మెల్యే వినోద్‌తోపాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండడంతో కాంగ్రెస్ ఓట్లు తిరిగి 15కు చేరాయి.
భూదాన్‌పోచంపల్లిలో పైచేయి
నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలో హంగ్ ఏర్పడగా, చైర్మన్ పీఠం కాంగ్రె్‌సకు దక్కనుంది. ఇక్కడ 13 వార్డులకు కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 5, బీజేపీ ఒక్క స్థానంలో, మరో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7 కావడంతో కాంగ్రె్‌సకు ఒక వార్డు తగ్గింది. శుక్రవారం ఫలితాలు వెలువడిన వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగారు. స్వతంత్రంగా గెలుపొందిన వార్డు సభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మొత్తం ఏడుగురు కౌన్సిలర్లను రాత్రికి రాత్రే హైదరాబాద్ నగర శివార్లలోని రిసార్ట్‌కు తరలించారు. బీజేపీ కౌన్సిలర్ సైతం కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించి శిబిరం వద్దకు చేరుకోవడంతో కాంగ్రెస్ బలం ఎనిమిదికి చేరింది.
వరంగల్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులే కింగ్ మేకర్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్స్ అఫిషియో సభ్యులే కింగ్ మేకర్లుగా మారారు. జిల్లాలో బీఆర్‌ఎస్ మెజారిటీ సాధించిన ఏకైక స్థానం తొర్రూరు. ఇక్కడ 16 వార్డులుండగా బీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. శనివారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో ఇక్కడ మొత్తం ఓట్ల సంఖ్య 18కి చేరింది. కాంగ్రెస్ సభ్యులు తొమ్మిది మంది అయ్యారు. ఇది ఉత్కంఠంగా మారింది. కాగా, కేసముద్రంలోని 16 వార్డుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సకు చెరి 8 వార్డులు దక్కాయి. మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ కేసముద్రంలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ బలం తొమ్మిదికి చేరడంతో కేసముద్రం మునిసిపాలిటీ హస్తగతమయ్యే అవకాశాలున్నాయి. వర్ధన్నపేటలోని 12వార్డుల్లో బీఆర్‌ఎస్ ఆరు వార్డులు, కాంగ్రెస్ ఐదు వార్డులు గెలిచాయి. ఒక్క చోట గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ గూటికి చేరడంతో రెండు పార్టీలకు చెరిసమానంగా ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే నాగరాజు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఏడుకు చేరింది. మహబూబాబాద్ మునిసిపాలిటీలో 36 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 13 చోట్ల, సీపీఎం మూడు చోట్ల విజయం సాధించడంతో వీరి బలం 16కు చేరనుంది. ఇద్దరు స్వతంత్రులు కూడా కాంగ్రె్‌సకు మద్దతు ఇస్తున్నట్లుగా సమాచారం. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 19కి చేరకుంది. బీజేపీ సభ్యుడితో పాటు కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఒక్కరిని తమ వైపు లాక్కుంటే చైర్మన్ స్థానం దక్కుతుందని బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.