Vedire Sri Ram: తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్యాయం!
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:42 AM
తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు తీవ్ర అన్యాయం చేశాయని మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరాం ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు....
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టుకూ నీటి కేటాయింపులు చేయలేదు
తెలంగాణకు చేసిన అతిపెద్ద మోసం ఇదే..
ఇచ్చంపల్లి, కంతన్‌పల్లి, తుమ్మిడిహెట్టిల్లో ప్రాజెక్టులు చేపట్టకపోవడం బీఆర్‌ఎస్ వ్యూహాత్మక తప్పిదం
‘మహారాష్ట్ర’ సలహాదారు వెదిరె శ్రీరాం
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు తీవ్ర అన్యాయం చేశాయని మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరాం ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్, ఒక్క ప్రాజెక్టుకూ నీటిని కేటాయించలేదని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అతిపెద్ద మోసం ఇదేనన్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తే, వాటిని ఎలా పరిష్కరించాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఇచ్చంపల్లి, కంతన్‌పల్లి, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టులు చేపట్టకపోవడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యూహాత్మక తప్పిదమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనే తప్పుల తడక అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, నల్లమలసాగర్‌కు సంబంధించి ‘ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్)’ మాత్రమే సీడబ్ల్యూసీకి ఇచ్చిందని, డీపీఆర్ కాదని శ్రీరాం స్పష్టం చేశారు. మంగళవారమిక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా- కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు చేసిన అన్యాయం’ అన్న అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘2014 కంటే ముందు కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్‌ఎ్‌సలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించుకుంటున్న ఈ పార్టీలు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేశాయో మాత్రం చెప్పడం లేదు. మరోవైపు, 400 టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేసుకునేలా ఏపీ ప్రభుత్వం, గడిచిన పదేళ్లలో పలు పనులు పూర్తిచేసింది. ఏ సాగునీటి ప్రాజెక్టుకైనా హైడ్రాలిక్, పర్యావరణ అనుమతులు కీలకం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈ రెండూ రాలేదు. అయితే, తాము ఐదు అనుమతులు సాధించినట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. హైడ్రాలిక్ (నీటి కేటాయింపులు), పర్యావరణ అనుమతులు లేకపోతే ఇవన్నీ వృఽథానే’ అని శ్రీరాం వివరించారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో ఏపీ ప్రభుత్వం, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రోజూ 4.3 టీఎంసీల నుంచి 13.7 టీఎంసీలకు పెంచింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులపై పదేళ్లలో సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
కృష్ణా జలాల్లో 500 టీఎంసీల నీటి వాటా న్యాయంగా రావాలి. కానీ, 299 టీఎంసీలకే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి అన్యాయం చేసింది. 2015లో జరిగిన ఈ ఒప్పందం, ఏడాది పాటే అని బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించినా, 2020 వరకూ కొనసాగింది. ఇంకా దారుణమేంటంటే ఒప్పందం చేసుకున్న 299 టీఎంసీల వాటాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, దిండి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడం. ఈ ప్రాజెక్టులకు బచావత్ ట్రైబ్యునల్ నీటిని కేటాయించింది కూడా’ అని శ్రీరాం తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఒక్క ఏడాది కూడా 299 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయిందని ఆరోపించారు. 90 శాతం పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎవరూ ఆపలేదని, దాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆపిందని శ్రీరాం తెలిపారు.
కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరి విస్మయం..
కృష్ణా బేసిన్‌లో సాగునీటి ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి విస్మయం కలిగిస్తోందని శ్రీరాం అన్నారు. ‘ఈ బేసిన్‌లోని ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇది భవిష్యత్తులో అదనపు నీటి కేటాయింపులకు అవరోధంగా మారే ప్రమాదం ఉంది. పాలమూరు ప్రాజెక్టుకు గోదావరి జలాల మళ్లింపు పథకం కింద 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ కింద మరో 45 టీఎంసీలను వెల్లడిస్తూ, సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇచ్చారు. అయితే, చెరువుల వారీగా వివరాలను కోరితే కాంగ్రెస్ ప్రభుత్వం క్లస్టర్ (జిల్లా) వారీగా ఇచ్చింది. అందుకే డీపీఆర్‌ను తిప్పి పంపింది. కచ్చితమైన వివరాలు అందిస్తే డీపీఆర్‌కు ఆమోదం లభిస్తుంది’ అని వివరించారు. ‘147 టీఎంసీల గోదావరి జలాలను ఛత్తీ్‌సగఢ్ వాడుకోలేకపోతోంది. ఇందులో తెలంగాణ, ఏపీలకు 50 టీఎంసీల చొప్పున కేటాయించేందుకు కేంద్రం సంకల్పించినా, 90 శాతం నిధులిచ్చేందుకు ముందుకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదు’ అని శ్రీరాం ఆరోపించారు.