పరిహారం....పరిహాసం...!
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:29 PM
సింగరేణి ఓపెన్‌కాస్టు గని ఏర్పాటు కోసం సేకరించే భూముల్లో భారీ అవినీతి వెలుగు చూసింది. భూములకు నష్ట పరిహారం చెల్లింపుల్లో అర్హత లేనివారికి లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమైంది.
-ఓసీపీ కోసం సేకరించిన భూముల్లో భారీ అవినీతి
-అసైన్డ్‌దారులను కాదని భూముల ఆక్రమణ దారులకు లబ్ధి
-వారి పేరిటే చెక్కులు ఇచ్చేందుకు రంగం సిద్ధం
-పైరవీ పేరిట రూ. 5 లక్షల చొప్పున వసూలు
-శ్రీరాంపూర్ ఓసీ-2లో వెలుగు చూసిన బాగోతం
మంచిర్యాల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఓపెన్‌కాస్టు గని ఏర్పాటు కోసం సేకరించే భూముల్లో భారీ అవినీతి వెలుగు చూసింది. భూములకు నష్ట పరిహారం చెల్లింపుల్లో అర్హత లేనివారికి లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామ పంచాయతీతోపాటు దాని పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్లు 369 నుంచి 1184 వరకు మొత్తం 77.15 ఎకరాలను శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు-2 గని విస్తరణ కోసం సింగరేణి అఽధికారులు భూ సేకరణ జరిపారు. ఇందులో భాగంగా సంబంధీకుల జాబితా కూడా తయారు చేశారు. ఎంపిక చేసినవన్నీ గతంలో పలువురికి అసైన్డ్ చేసిన భూములు కావడంతో జనరల్ ప్యాకేజీ కింద ఎకరాకు 15.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నగదు చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాగా, బ్యాంకులో జమ చేయడమే మిగిలి ఉంది.
భూములు పరాదీనం....
సింగరేణి ఓసీపీ కింద సేకరించే భూములన్నీ అర్హతగల బడుగు, బలహీన వర్గాల ప్రజలు పలువురికి వ్యవసాయం కోసం ప్రభుత్వం గతంలో అసైన్డ్ చేసింది. అయితే కాల క్రమేణ ఆ భూములు మొత్తం ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అసైన్‌మెంట్ చట్టం ప్రకారం ప్రభుత్వం మంజూరు చేసిన భూములను ఇతరులకు విక్రయించడం చేయకూడదు. ఒకవేళ లబ్ధిదారులకు భూములు అవసరంలేని పక్షంలో తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. అలా కాకుండా ఇతరుల చేతుల్లోకి వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ భూములను సింగరేణి సేకరించడం, పరిహారం చెల్లింపులకు సమయం ఆసన్నం కావడంతో పై వర్గాలకు చెందిన వ్యక్తులు భూముల లబ్ధిదారులకు కాకుండా, తమ పేరిటనే చెక్కులు పొందేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి అధికారులు కూడా వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిహారం అందజేసేందుకు అధికారులు తయారు చేసిన తుది జాబితాలో అసలు లబ్ధిదారులకు బదులు 55 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లను చేర్చారు. దీంతో వారి పేరిటే చెక్కులు మంజూరు చేసేందుకు రంగం సిద్ధమైంది. అసైన్‌మెంట్ పత్రాలు లేకపోయినా ఆక్రమణదారుల పేర్లు జాబితాలోకి ఎలా వచ్చాయో, సంబంధిత అధికారులకే తెలియాలి.
రూ. 5 లక్షల చొప్పున వసూలు...
భూముల అసలు లబ్ధిదారులకు కాకుండా తమ పేరిట పరిహారం ఇచ్చేలా పై వర్గాలకు చెందిన బడాబాబులు పెద్ద తతంగమే నడిపారు. అధికారులను మచ్చిక చేసుకొనే క్రమంలో దళారీ వ్యవస్థకు ఆజ్యం పోశారు. దళారులుగా అవతారమెత్తిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు బడా బాబుల నుంచి రూ. 5 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విషయం బయటకు పొక్కడంతో భూముల అసలు లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిహారంగా వచ్చిన సొమ్ము నుంచి కొంత మొత్తం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ అక్రమ బాగోతం విషయమై భూముల రీ సర్వే చేపట్టాలని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేగుంట నారాయణ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోతోపాటు శ్రీరాంపూర్ సింగరేణి జనరల్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెండు నెలలు గడిచినప్పటికీ అధికారులు పట్టించుకోకపోగా, గుట్టు చప్పుడు కాకుండా పరిహారం చెల్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా భూముల రీ సర్వే చేపడతారా...? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.