Share News

kumaram bheem asifabad- ప్రయాణికుల అవస్థలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:18 PM

కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ సమస్యలకు నిలయంగా మారింది. దీంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా మూడు ప్లాట్‌ఫారమ్‌ నిర్మించారు. కానీ మూడో ప్లాట్‌ ఫాంపై టికెట్టు తీసుకునేందుకు కౌంటర్‌ లేక పోవడంతో నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

kumaram bheem asifabad- ప్రయాణికుల అవస్థలు
కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లోని మూడోఫ్లాట్‌ఫారమ్‌

- మూడో ప్లాట్‌ఫారమ్‌పై టికెట్‌ కౌంటర్‌ లేక ఇక్కట్లు

కాగజ్‌నగర్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ సమస్యలకు నిలయంగా మారింది. దీంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా మూడు ప్లాట్‌ఫారమ్‌ నిర్మించారు. కానీ మూడో ప్లాట్‌ ఫాంపై టికెట్టు తీసుకునేందుకు కౌంటర్‌ లేక పోవడంతో నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. టికెట్‌ తీసుకోవాలంటే మళ్లీ మొదటి ప్లాట్‌ఫారమ్‌ దాటి కౌంటర్‌ వద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు సమయం వృధాతో పాటు పలు రైళ్లు ఎక్కలేక పోతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. మూడో ప్లాట్‌ఫాంపై వెంటనే ప్రత్యేక టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు రైల్వే శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో పాటు మూడో ప్లాట్‌ఫారమ్‌పై పూర్తి స్థాయిలో షెడ్లు నిర్మించక పోవడంతో ప్రయాణికులు ఎండలో, చెట్ల నీడ కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కురిసిన సమయంలో తడిసి పోవాల్సి పరిస్థితి నెలకొంది. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల కోసం లిఫ్ట్‌ సౌకర్యం లేదు. ఫుడ్‌ కోర్టులు, కిడ్స్‌ ప్లే ఏరియా అవసరం ఉంది. వీటితో పాటు కాగజ్‌నగర్‌ నుంచి షిర్డికి రాకపోకలు సాగించేందుకు బుసావాల్‌ రైలు కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో కాగజ్‌నగర్‌ వరకు హాల్టింగ్‌ ఉండేది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ హాల్టును తీసేశారు. భాగ్యనగర్‌, ఇంటర్‌సిటి, కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పరిశుభ్రత పాటించడం లేదు. సికింద్రాబాద్‌-కాగజ్‌నగర్‌ మధ్యనడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కాగజ్‌నగర్‌కు రాత్రి 10 గంటలకు రావాల్సి ఉంటుంది. కాని ఇదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండటంతో భాగ్యనగర్‌ రైలు పక్కన పెట్టేసి పంపిస్తుండడంతో రాత్రి 11 నుంచి 12 గంటల వరకు కాగజ్‌నగర్‌కు వస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేస్టేషన్‌లో నెలకొన్న ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలి..

- అన్నం నాగర్జున, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌లో మూడో ప్లాట్‌ఫారమ్‌పై టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలి. ఈ ప్లాట్‌ఫారమ్‌ పరిసర ప్రాంతాలైన భట్టుపల్లి, జీడిచేను, ఈసుగాం, నజ్రూల్‌నగర్‌, కడంబా ప్రాంతాల నుంచి ప్రయాణికులు నేరుగా ఇక్కడికే వస్తారు. కానీ టికెట్‌ కోసం మళ్లీ మొదటి ఫ్లాట్‌ సమీపంలో ఉన్న కౌంటర్‌ వద్దకు పోవాల్సి వస్తోంది. ఫుట్‌ బోర్డు బ్రిడ్జి ఎక్కి పోవాల్సి ఉంటుంది. రోజు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి కీలక సమస్యలు పరిష్కరించాలి.

Updated Date - Jun 09 , 2026 | 10:18 PM