సర్వజనులను సమాయత్తం చేద్దాం
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:29 AM
దేశంలో కమ్యూనిస్టు పార్టీల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడంతో పాటు.. మతోన్మాద దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసమస్యలపైనా ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకునేందుకు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యం...
భవిష్యత్తులో ఐక్యంగా పోరాటాలు నిర్వహిద్దాం
కమ్యూనిస్టు పార్టీల జాతీయ సెమినార్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
ఖమ్మం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో కమ్యూనిస్టు పార్టీల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడంతో పాటు.. మతోన్మాద దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసమస్యలపైనా ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకునేందుకు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సర్వజనులను సమాయత్తం చేసి ఐక్యపోరాటాలకు సిద్ధం చేయాలని నాలుగు కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకులు పిలుపునిచ్చారు. ఎదురవుతున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేఖంగా భవిష్యత్తు ఉద్యమాలను ముందుకు సాగిద్దామని నిర్ణయించారు. ఖమ్మంలో మంగళవారం సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)లిబరేషన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాలుగు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ‘నేటి భారత దేశం కమ్యునిస్టు పార్టీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో నాలుగు పార్టీల జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబి, దీపాంకర్ భట్టాచార్య, డి.దేవరాజన్ ప్రసంగించి.. కమ్యూనిస్టు పార్టీలకు దశాదిశను నిర్ధేశించారు. వామపక్షాల ఐక్య ఉద్యమాల ఆవశ్యకతను వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డి రాజా మాట్లాడుతూ దేశంలో వలస విధానాల వల్ల అనేక అసమానతలున్నాయన్నారు. ఆరెస్సెస్ ఈ దేశంలో స్వాతంత్య్రం కోసం కానీ, ప్రజాసంక్షేమం కోసం కానీ పనిచేయలేదని ప్రజల కోసం ఏమీ పనిచేయలేదని దేశంలో కార్మిక వర్గాన్ని వారి హక్కులను కాపాడుకోవడం కోసం వర్గదోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలన్నారు. కేంద్రంలోని అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఆరోపించారు. సీపీఐ(ఎంల్) జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ప్రసంగిస్తూ సీపీఐ వందేళ్ల ఉద్యమం ఒక చరిత్ర అని, ఖమ్మంలో ఘనంగా జరుపుకొన్న ముగింపు ఉత్సవాలతో కమ్యూనిస్టుల పట్ల ప్రజాకర్షణ కనిపిస్తోందన్నారు. తెలంగాణ విప్లవ పోరాటాల గడ్డ అని, తెలంగాణకు విప్లవ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి డి దేవరాజన్ ప్రసంగిస్తూ కమ్యూనిస్టు పార్టీల్లో ఐక్యత పెంపొందించుకోవాలని, సిద్ధాంతపరమైన పద్ధతుల్లో పనిచేసే విధానంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈసెమినార్ లక్ష్యాన్ని వివరించారు. నాలుగు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు నేతలు ఒకే వేదికపై నిలిచి ఐక్యతాభావాన్ని చాటి చెప్పడం గర్వించదగిన విషయమన్నారు. ఈ సెమినార్‌లో ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్, సీపీఐ జాతీయ నాయకులు రామకృష్ణపాండే, గిరిజాశర్మ, ప్రకాశ్ బాబు, సంతో్‌ష, సంజయ్, కె.రామకృష్ణ, పల్లంసేన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ హాజరయ్యారు.