Communist Gathering: ఖమ్మంలో 18న కమ్యూనిస్టు కవాతు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:41 AM
కమ్యూనిస్టుల కోటగా ఉన్న ఖమ్మం మరోసారి ఎర్రజెండాల కవాతుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ఇక్కడి ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు.....
సుమారు 10 వేల మందితో జనసేవాదళ్ ర్యాలీ
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఏర్పాట్లు
ఖమ్మం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కమ్యూనిస్టుల కోటగా ఉన్న ఖమ్మం మరోసారి ఎర్రజెండాల కవాతుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ఇక్కడి ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు వేదిక కాబోతోంది. సీపీఐ శతాబ్ది ఉత్సవాల తొలి సభను మహారాష్ట్రలోని కాన్పూర్‌లో 2024 డిసెంబరు 26న ప్రారంభించారు. ఏడాది పాటు ఈ వేడుకలను పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. డిసెంబరు 17 న ఖమ్మంలో ముగింపు సభ నిర్వహించాలని నిర్ణయించినా, పంచాయతీ ఎన్నికల వల్ల ఈ నెల 18కి వాయిదా వేశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, విదేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ సభ కోసం జిల్లా, రాష్ట్ర నాయకత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమైంది. 2-3 లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి జనసమీకరణ చేయాలని నిర్ణయించింది. సుమారు 10వేల మంది తో ఖమ్మంలో జనసేవాదళ్ కవాతు నిర్వహించబోతున్నారు. 18న జరిగే ముగింపు సభ అనంతరం 19నుంచి 21వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇందులో సుమారు 200మంది ప్రతినిధులు పాల్గొంటారు. 20న ప్రత్యేకంగా 5కమ్యూనిస్టు పార్టీలతో సెమినార్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ.రాజాతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి, సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ డి.దేవరాజన్, ఆర్‌ఎ్‌సపీ జనరల్ సెక్రటరీ మనోజ్ భట్టాచార్య తదితరులు హాజరవుతున్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి, ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సెమినార్‌లో చర్చించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు.