‘మూసీ’పై ఉప సంఘం ఏర్పాటు చేస్తూ జీవో జారీ
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:24 AM
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సీఎస్ కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులను జారీ చేశారు.
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సీఎస్ కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తారని, కమిటీ కన్వీనర్‌గా మూసీ రివర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఎండీ ఉంటారని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అవసరమైన మార్గదర్శకాలను సూచించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, సమయానుకూల సమీక్షల కోసం ఈ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదీ పునరుజ్జీవం, మురికినీటి నిర్వహణ, వరదల నియంత్రణ, భూసేకరణ, పునరావాసం, ఆర్థిక వనరులు వంటి వ్యవహారాలపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేలా చూసే బాధ్యత ఈ కమిటీదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.