హైడ్రాపై వివాదాలు.. కబ్జాదారుల సృష్టే
ABN , Publish Date - Jul 27 , 2026 | 05:54 AM
హైడ్రా చట్టబద్ధమైన సంస్థ అని, చట్ట ప్రకారం నడుచుకుంటుందని సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను చెరబడుతున్న కొందరు..
చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ హైడ్రా
న్యాయవ్యవస్థపై సంపూర్ణ గౌరవం ఉంది
కోర్టులకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు
ఒకచోట భూమి చూపిస్తూ మరోచోట కబ్జా చేస్తున్నారు
ప్రైవేట్ భూముల్లోని పార్కుల స్థలంలోనే హైడ్రా బోర్డులు
తప్పుదోవ పట్టించే కాలనీ సంఘాలపై కేసులు
రూ.లక్షన్నర కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం.. 25 చెరువులను పునరుద్ధరిస్తున్నాం
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): హైడ్రా చట్టబద్ధమైన సంస్థ అని, చట్ట ప్రకారం నడుచుకుంటుందని సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను చెరబడుతున్న కొందరు రియల్టర్లు, కబ్జాదారులు పనిగట్టుకొని హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భారత పౌరుడిగా, బాధ్యతాయుత అధికారిగా తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో ఉపేక్షించడం ఉండదని స్పష్టం చేశారు. హైడ్రా ప్రస్థానం, చేపట్టిన చర్యలు, వస్తున్న ఆరోపణలు, వివాదాలపై ‘ఆంధ్రజ్యోతి’తో రంగనాథ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రెండేళ్ల హైడ్రా ప్రస్థానంపై మీ అభిప్రాయం?
హైడ్రాతో నగరానికి, ఇక్కడి ప్రజలకు మంచి జరిగిందని భావిస్తున్నాం. హైడ్రా వల్ల ఇప్పటివరకు నష్టపోయిన 300 కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన 3,350 ఎకరాల భూమిని కాపాడాం. 25 చెరువులను పునరుద్ధరిస్తున్నాం. చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న పట్టా (శిఖం) భూములను యజమానుల నుంచి సేకరిస్తున్నాం. ఇందుకు పరిహారం రూపంలో వారికి టీడీఆర్ ఇస్తున్నాం. చెరువుల్లో ఉండే నివాస గృహాల జోలికి వెళ్లం. నివాసేతర, తాత్కాలిక నిర్మాణాలు తొలగిస్తున్నాం. ఈ క్రమంలో 10, 15 ఏళ్ల నుంచి చెరువులు, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తోంది. సున్నం చెరువు, రామంతాపూర్ చెరువులో బాధితులకు పక్కా గృహాలు ఇస్తున్నాం. శాటిలైట్ చిత్రాలు, రెవెన్యూ రికార్డులు, స్థానికుల అభిప్రాయాల పరిగణనలో ఎప్పటి నుంచి గుడిసెలు ఉన్నాయన్నది గుర్తిస్తున్నాం. కొత్తగా గుడిసెలు వేసి మాకు ఇళ్లు కావాలనే వారిని పరిగణనలోకి తీసుకోం. కబ్జాదారులు నిరుపేదలను ముందుపెట్టి ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
హైడ్రా ప్రధాన లక్ష్యమేంటి? ఏం చేస్తున్నారు?
చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ.. హైడ్రా ప్రధాన లక్ష్యం. 750 చెరువుల్లో 650 చెరువుల ఎఫ్‌టీఎల్‌కు నోటిఫికేషన్ ఇచ్చాం. ఎఫ్‌టీఎల్ నిర్ధారణ జరిగిన చెరువుల్లో ఆక్రమణలు తొలగించి.. పూడికతీయడంతోపాటు పునరుద్ధరిస్తున్నాం. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి నగరంలోని చిన్న చెరువులనూ అభివృద్ధి చేస్తాం. వరద నీటి డ్రైన్లలోని క్యాచ్ పిట్‌ల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను హైడ్రా తొలగిస్తుంది. వర్షాకాల అత్యవసర బృందాలను ఖాళీగా ఉంచకుండా వారితో ఈ పని చేయిస్తున్నాం. ఇతర విభాగాల పరిధిలోని అంశాల జోలికి మేం వెళ్లడంలేదు. రక్షణ శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల విజ్ఞప్తి మేరకు కొన్ని ఆక్రమణల తొలగింపునకు హైడ్రా సహకరిస్తోంది. తాజాగా రక్షణ శాఖ అధికారులు తమ భూమిలో అక్రమ నిర్మాణం జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని కలిశారు. సంబంధిత విభాగాలను కలవాలని సూచించాం. రక్షణ శాఖ భూమి అంటే ప్రభుత్వానిదేనన్న ఉద్దేశంతో పరిశీలిస్తామన్నాం. పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చినా, ఇతర విభాగాలు సాయం కోరినా నిబంధనల మేరకు నడుచుకుంటున్నాం. కొన్నిసార్లు చర్యలూ తీసుకుంటున్నాం. 374 (బి) చట్టాన్ని సవరిస్తూ చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడే అధికారం హైడ్రాకు ప్రభుత్వం కల్పించింది.
ప్రైవేట్ భూముల్లో హైడ్రా బోర్డులు పెడుతున్నారు?
ప్రైవేటు వ్యక్తుల భూవివాదాల్లోకి హైడ్రా వెళ్లదు. లే అవుట్‌గా అభివృద్ధి చేసి.. ఇప్పటికే క్రయవిక్రయాలు జరిగి ప్లాట్లు రిజిస్ర్టేషన్ అయిన స్థలాల విషయంలో వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా భూమిని ఒకసారి అధికారికంగా/అనధికారికంగా ప్లాట్లుగా విభజించి విక్రయించడంతోపాటు రిజిస్ర్టేషన్ జరిగితే ఆ భూమిలో రోడ్లు, పార్కు, ఖాళీ స్థలం ఉండాల్సిందే. గతంలో సుప్రీంకోర్టు కూడా పలుమార్లు చెప్పింది. అనుమతి ఉన్న/లేని లే అవుట్ అయినా.. ప్లాట్లుగా విభజించిన పక్షంలో నిబంధనల ప్రకారం అక్కడి రోడ్లు, పార్కు, ఖాళీ స్థలాన్ని కాపాడేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆయా స్థలాల్లో హైడ్రా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
కక్షతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై..?
హైడ్రాపై సోషల్ మీడియాలో చాలా వరకు దుష్ప్రచారం జరుగుతోంది. మేం ఎవరిపైనా వ్యక్తిగత కక్షతో వ్యవహరించలేదు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ అనంతరం.. సంబంధిత విభాగాలను భాగస్వాములను చేస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్తుల కబ్జాలో కొందరు నేరస్తులూ ఉన్నారు. అలాంటి వారి పట్ల కొంత కఠినంగా ఉండక తప్పదు. అమీన్‌పూర్‌లో ఓ న్యాయవాది ఆక్రమించిన భూమి స్వాధీనం విషయంలో తప్పుడు ప్రచారం చేశారు. ఫిర్యాదు వచ్చిన ఏడాదికి విచారణ అనంతరం హైడ్రా చట్టబద్ధంగా వ్యవహరించింది.
కొందరు కాలనీ సంఘాల ప్రతినిధులు హైడ్రాను తప్పుదోవ పట్టిస్తున్నారట..?
అవును. ఇటీవల రెండు, మూడు విషయాలు మా దృష్టికి వచ్చాయి. కొందరు కాలనీ సంఘాల ప్రతినిధుల తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. ఓ కాలనీ సంఘం నాయకులు పార్కు స్థలం కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తరువాత వచ్చి అది పార్కు స్థలం కాదంటూ ప్లాట్లుగా విభజించి విక్రయించే ప్రయత్నం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా ఆ భూమిని కాపాడింది. పార్కు స్థలం కబ్జాకు యత్నించినందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.
ఇప్పటివరకు ఎన్నిసార్లు కోర్టుకు హాజరయ్యారు?
కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సంబంధించి రెండు పర్యాయాలు వ్యక్తిగతంగా హాజరయ్యాను. బతుకమ్మకుంట, లోతుకుంట భూముల విషయంలో కోర్టుకు స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. అవతలి వ్యక్తులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని కోర్టులు స్పందిస్తున్నాయి. మా వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డులనూ కోర్టు ముందుంచుతాం. భారతీయుడిగా, బాధ్యతాయుతమైన అధికారిగా న్యాయస్థానాలను గౌరవిస్తాం. సున్నం చెరువు, తమ్మిడికుంట చెరువుల కేసుల విషయంలో వర్చువల్‌గా రెండు పర్యాయాలు విచారణలో పాల్గొన్నాను.
హైడ్రా సర్కారుకు వరమా? శాపమా?
హైడ్రా చట్టబద్ధంగా పని చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 38ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. సంస్థకు వేలాది మంది మద్దతు తెలుపుతున్నారు. స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైడ్రా ప్రభుత్వానికి వరమా, శాపమా అన్నది దీంతో తెలిసిపోతుంది. కబ్జాదారులు తప్ప.. ఇతరులు హైడ్రా తీరును అభినందిస్తున్నారు.
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏం చేస్తున్నారు?
హైడ్రా ఏర్పడిన తరువాతే చాలా మందికి అధికారిక లే అవుట్, అనుమతి లే అవుట్ అన్నదానిపై అవగాహన వచ్చింది. గతంలో తక్కువ ధరకు వస్తుందని అనుమతిలేని లే అవుట్లలో ప్లాట్లు కొనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. లే అవుట్‌లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు ముందుగా ఆ ప్రాజెక్టులకు అనుమతి ఉందేమో చూసుకోవాలి. ఆ ప్రాంతం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందా? అన్నది హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో పరిశీలించాలి. ప్రభుత్వ, పార్కు స్థలమా? అన్నది భూభారతిలో తెలుసుకోవాలి. త్వరలో హైడ్రా రక్ష పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. దేశంలోనే హైడ్రా మొదటి మోడల్. ఇతర రాష్ర్టాల్లోనూ హైడ్రా ఏర్పాటు కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఇది సంస్థ సాధించిన విజయం.
హైడ్రాపై వివాదాలకు కారణమేంటి?
కొందరు రియల్టర్లు, కబ్జాదారుల ప్రత్యేక మోడస్ ఆపరెండీ ఇందుకు కారణం. ప్రభుత్వ ఆస్తులను చెరబట్టి తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సాంకేతికంగా వారిది తాత్కాలికంగా పైచేయి అవుతోంది. ఓ ప్రాంతం సర్వే నెంబర్లను మరో ప్రాంతంలో చూపుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వివిధ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భూమి ఉంటుంది. దీనిని బీ-2 క్యాటగిరీ భూములుగా పరిగణిస్తారు. కంటోన్మెంట్‌లో ఈ తరహా భూమి 119 ఎకరాలు ఉంది. లోతుకుంటోని సర్వే నెంబర్ 1, 2లో ఈ భూమి ఉన్నట్టుగా చూపుతూ పలు నిర్మాణ సంస్థలు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాయి. మైనింగ్, అటవీ శాఖ అనుమతులు లేకుండా 2500 ఏళ్ల చరిత్ర ఉన్న గుట్టలను బ్లాస్టింగ్ చేస్తున్నారు. చెట్లు తొలగిస్తున్నారు. దీంతో అక్కడి వన్యప్రాణుల మనుగడ కష్టంగా మారింది. ది సేవ్ రాక్ సొసైటీ, పర్యావరణవేత్తల ఫిర్యాదు మేరకు ఆభూమికి ఫెన్సింగ్ వేశాం. డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ (డీఈవో) వద్ద ఉన్న వివరాల ప్రకారం జీఎల్‌ఆర్ 243 మ్యాప్ పరిశీలించాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం హైడ్రా ఫెన్సింగ్ వేసిన భూమికి లోతుకుంట సర్వే నెంబర్ 1, 2 ఉన్న ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. తప్పుడు పద్ధతుల్లో చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. వీటిపై మేం కూడా కౌంటర్ దాఖలు చేస్తున్నాం. గోల్కొండ పేరు చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని చార్మినార్ నాది అంటే ఎలా? కోర్టు కంటెంప్ట్‌లపై ఆధారాలతో సహా అప్పీల్‌కు వెళతాం.
కోడి చెరువుపై పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి?
కోడి చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కొనుగోలు చేసిన పది ఎకరాలు ప్రైవేటు పట్టా భూమి. వాళ్లు చెరువును ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. పక్కన భూములున్న కొందరు మట్టి పోసి ఎత్తు పెంచారు. పవన్‌కల్యాణ్ భూమిలో చెరువు యథాతథంగా ఉంది. వరద నీరు వస్తోంది. ఫెన్సింగ్ వేశారు. అది వరద ప్రవాహానికి అడ్డుగా లేదు. అయినా దానిని తొలగించాలని వారికి సూచించాం. చెరువుల్లో ప్రైవేట్ పట్టా భూములు ఉంటాయి. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే కొందరు సోషల్ మీడియా వాళ్లు వ్యక్తిగత దురుద్దేశాలతో కొన్ని చేస్తుంటారు. అలాంటి వాటిని హైడ్రా పరిగణనలోకి తీసుకోదు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను మాత్రమే పరిశీలించి చట్ట ప్రకారం స్పందిస్తాం.