Share News

కమీషన్ల కక్కుర్తి!

ABN , Publish Date - May 25 , 2026 | 05:45 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే సకాలంలో వాటి నిర్మాణం చేపట్టి, అందుబాటులోకి తీసుకురావాలి.

కమీషన్ల కక్కుర్తి!

  • మందుల బిల్లులు ఆపి.. సివిల్‌ పనులకు చెల్లింపు

  • ఇప్పటి దాకా రూ.380 కోట్లు.. మరో రూ.320 కోట్లు సిద్ధం

  • 70 శాతం పనులు పూర్తి చేస్తేనే బిల్లులు ఇవ్వాలన్న సీఎం

  • 10-20 శాతం పనులకూ చెల్లించేస్తున్న అధికారులు

  • కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బీ, టీజీఎం ఎస్ఐడీసీ అధికారుల కుమ్మక్కు

  • పెండింగ్‌లో రూ.550 కోట్ల బిల్లులు!

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే సకాలంలో వాటి నిర్మాణం చేపట్టి, అందుబాటులోకి తీసుకురావాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని గతంలో వెల్లడించారు. క్రమం తప్పకుండా నిధులను కూడా విడుదల చేస్తున్నారు. రోడ్లు, భవనాలు; వైద్య ఆరోగ్య శాఖల్లోని కొందరు అధికారులు దీన్నే ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. నిర్మాణ పనులు 70 శాతం పూర్తయితేనే బిల్లులు చెల్లించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, 10-20 శాతం పనులు పూర్తి చేసిన వారికి కూడా అధికారులు బిల్లులు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్లు అందడంతో సివిల్‌ కాంట్రాక్టర్లపై ఎనలేని ప్రేమ చూపుతున్నారు. ఎంతలా అంటే గడిచిన 3-4 నెలల్లోనే రూ.380 కోట్ల సివిల్‌ పనుల బిల్లులను చెల్లించారు. మరో రూ.320 కోట్ల బిల్లులను సిద్ధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఆ మొత్తం కూడా చెల్లించబోతున్నారు. బిల్లుల చెల్లిస్తే ఎవరికీ అభ్యంతరాలుండవు. కానీ, మిగతా వాటికి చెల్లించాల్సిన బిల్లులను ఆపి మరీ సివిల్‌ కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సీఎం ఆదేశాలను సైతం బేఖాతరు చేసి, బిల్లులు చెల్లించడం గమనార్హం. మందులు, ఎక్వి్‌పమెంట్‌, సర్జికల్స్‌కు సంబంధించిన బిల్లులను పక్కన పెట్టి.. సివిల్‌ పనుల బిల్లులను వేగంగా చెల్లిస్తున్నారని డ్రగ్స్‌, ఎక్విప్‌మెంట్ సరఫరా ఏజెన్సీలు మొత్తుకుంటున్నాయి. వాటికి కేటాయించిన నిధులను మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) అధికారుల తీరుతో సర్కారుకు చెడ్డపేరు వస్తోందని అంటున్నారు.


సివిల్‌పై అంత ప్రేమ ఎందుకో?

మందులు, సర్జికల్స్‌, ఎక్వి్‌పమెంట్‌ బిల్లులను పక్కన పెట్టి మరీ సివిల్‌ బిల్లులను చకచకా చెల్లించేలా చూడడంలో కాంట్రాక్టర్ల హస్తం ఉందని మందుల సరఫరాదారులు ఆరోపిస్తున్నారు. వారు అధికారులకు భారీగా కమీషన్లు ఇవ్వడంతో తమకు చెల్లించాల్సిన బిల్లులను పక్కనపెట్టారని ఓ ఔషధ సరఫరాదారు వాపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక సివిల్‌ కాంట్రాక్టర్‌, ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పారని మరో సరఫరాదారుడు ఆరోపించారు. సరిగ్గా ఏడాది క్రితం ఎక్విప్‌మెంట్స్‌ బిల్లులు చెల్లించారని, మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌లో అరకొరగా రూ.17కోట్లు చెల్లించారని మరో ఏజెన్సీ వెల్లడించింది. ప్రస్తుతం డ్రగ్స్‌, సర్జికల్‌, ఎక్విప్‌మెంట్‌ అన్నీ కలిపి సుమారు 550కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌ ఉన్న ట్లు చెబుతున్నారు. అదే సమయంలో సివిల్‌ వర్క్స్‌కు సంబంధించి పెండింగ్‌ బిల్లులేవీ లేవని అంటున్నారు. సివిల్‌ కాంట్రాక్టర్లు పెద్దమొత్తంలో కమీషన్‌లు ఇవ్వడం వల్లే వారి బిల్లులు ముందుగా చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డ్రగ్స్‌, ఎక్వి్‌పమెంట్‌, సర్జికల్స్‌లో తమకే కంపెనీలు 3-4శాతం పర్సంటేజీలిస్తాయని, తాము డబుల్‌ డిజిట్‌ కమీషన్లు ఇవ్వలేమని అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం మందుల బిల్లులను ప్రతినెలా విడుదల చేయాలని, కనీసం నెలకు రూ.100 కోట్లయినా చెల్లించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మురిగిపోయిన రూ.390 కోట్లు!

ఔషధ కొనుగోలు కోసం ప్రభుత్వం మూణ్నెల్లకోసారి నిధులు విడుదల చేస్తుంది. గత ఏడాది మందులు, ఎక్వి్‌పమెంట్‌, సర్జికల్స్‌ కోసం నాలుగు విడతల్లో రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాలేదు. ఒక్క విడత సొమ్ములే వచ్చినట్లు సరఫరాదారులు వెల్లడించారు. సర్జికల్స్‌కు రూ.144 కోట్లు, ఎక్వి్‌పమెంట్‌కు రూ.120 కోట్లు, రీయెజెంట్స్‌కు రూ.40 కోట్లు, డ్రగ్స్‌కు చెందిన నిధులు కలిపి సుమారు రూ.390 కోట్ల బడ్జెట్‌ మురిగిపోయిందని తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 05:45 AM