Share News

తిండి మీద బండ!

ABN , Publish Date - May 03 , 2026 | 05:37 AM

పశ్చిమాసియా పరిణామాలతో ఎల్పీజీ కొరత, వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం ఆహార పరిశ్రమపై పడిన ప్రభావం ఇది. వీధుల్లోని చిన్నపాటి ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల దాకా ఆగమాగం అవుతున్నాయి.

తిండి మీద బండ!

  • వాణిజ్య సిలిండర్ల కొరత, పెరిగిన ధరలతో ఆహార పరిశ్రమపై తీవ్ర ప్రభావం

  • రోజూ వెళ్లే ఓ హోటల్‌.. ప్లేట్‌ ఇడ్లీ ఆర్డర్‌ చేస్తే కేవలం చట్నీతో తెచ్చిపెట్టారు.. ఎల్పీజీ కొరత, ధర పెరగడంతో సాంబార్‌ చేయడం మానేసినట్టు చెప్పారు..

  • అది ప్రముఖ భోజనశాల.. మీల్స్‌ కావాలంటే తెచ్చిపెట్టారు. ఎప్పుడూ నాలుగైదు కూరలు, ఫ్రైలు ఇచ్చే చోట.. కేవలం పప్పు, ఒక కర్రీ, కాసింత ఫ్రై ఇచ్చారు.

  • ఇంకో రెస్టారెంట్‌.. ఫుల్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే ఇద్దరికి సరిపోయేది. కానీ ఇప్పుడు ఒకరికి ఎక్కువ, ఇద్దరికి తక్కువగా ఉంటోంది..

.. పశ్చిమాసియా పరిణామాలతో ఎల్పీజీ కొరత, వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం ఆహార పరిశ్రమపై పడిన ప్రభావం ఇది. వీధుల్లోని చిన్నపాటి ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల దాకా ఆగమాగం అవుతున్నాయి. కొరత కారణంగా బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.6 వేల వరకు పెంచేశారు. మొత్తంగా ‘గ్యాస్‌‘ భారాన్ని తట్టుకునేందుకు.. ఎక్కువ సేపు ఉడికించే, మరిగించే వంటకాల తయారీని హోటళ్లు, రెస్టారెంట్లు ఆపేస్తున్నాయి. వంటకాల మెనూలో మార్పులు చేస్తున్నాయి. ఇప్పటికే ధరలు పెంచేసిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆహారం పరిమాణాన్ని తగ్గించి ఇస్తున్నాయి. ఈ క్రమంలో వంటకాల తయారీ తగ్గిపోవడంతో.. వంట మాస్టర్లు, హెల్పర్ల నుంచి క్లీనింగ్‌ సిబ్బంది వరకు చాలా మందిని తొలగిస్తున్నాయి. రోజువారీ కూలీ కింద పనికి తీసుకునేవారిని రావొద్దని చెబుతున్నాయి. దీనితో లక్షలాది మంది ఉపాధిపై ప్రభావం పడుతోంది. ఇన్నాళ్లూ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్‌ వంటి నగరాలకు వచ్చినవాళ్లు ఇప్పుడు సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

నడిపితే నష్టాలు.. మూసేయలేరు..

హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు, కేటరింగ్‌ యూనిట్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులకు రోజువారీ ఖర్చులు పోనూ 15-20 శాతం వరకు లాభం మిగిలేది. కానీ గత రెండు నెలల్లో పరిస్థితి తలకిందులైంది. వాణిజ్య సిలిండర్ల కొరత, ధరలు పెరగడం, నూనెలు, ఇతర సరుకుల ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం భారంగా మారింది. 20-40శాతం నష్టాలు రావడం మొదలైంది. 25శాతం ధరలు పెంచినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనితో రోజుకు మూడు సిలిండర్లు వినియోగించేవారు.. రెండింటితో సరిపెడుతున్నారు. అవీ నేరుగా దొరక్క బ్లాక్‌ మార్కెట్లో అడ్డగోలు ధరలకు తేవాల్సి వస్తోంది. దీనితో నడిపితే నష్టాలు.. మూసివేస్తే గిరాకీ ఎక్కడ దెబ్బతింటుందోనన్న ఆందోళన మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారాన్ని కాపాడుకోవడానికి కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి వంటమాస్టర్లు, ఇతర సిబ్బందిని తొలగిస్తున్నారు. ఉపాధి కోల్పోయినవారికి బయట అదే రంగంలో పని దొరకడం లేదు. దీనితో సొంత గ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.


బ్లాక్‌ మార్కెట్లో కొనలేని స్థితికి..

ఈ ఏడాది మార్చి 6వరకు రూ.1,961 పలికిన 19కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర మొదట రూ.2,105కు, ఏప్రిల్‌ 1న రూ.2,321కు పెరిగింది. తాజాగా శుక్రవారం ఏకంగా రూ.3,315కి చేరింది. ఆ ధరకైనా కావాల్సినన్ని సిలిండర్లు దొరికే పరిస్థితి లేదు. కొందరు డీలర్లు, డెలివరీబాయ్స్‌ వాణిజ్య సి లిండర్లను రూ.5,000-6,000దాకా విక్రయిస్తున్నారు.

తగ్గిన వంటలు.. పరిమాణం కుదింపు!

ధరాభారం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు వంటకాల మెనూలో మార్పులు చేస్తున్నారు. గతంలో రూ.180 పెట్టి సింగిల్‌ బిర్యానీ తీసుకుంటే గతంలో తనతోపాటు కూతురుకు సరిపోయేదని.. శనివారం అదే సింగిల్‌ తీసుకుంటే ఒక్కరికి కూడా సరిగా సరిపోలేదని కొండాపూర్‌కు చెందిన నితిన్‌ చెప్పారు. బిర్యానీ పరిమాణం, నాణ్యత తగ్గాయని వాపోయారు. గ్యాస్‌ భారం కారణంగా ప్లేట్‌ మీల్స్‌ ధరను రూ.120 నుంచి రూ.130కి పెంచామని.. కూరల సంఖ్య తగ్గించాల్సి వచ్చిందని హైదర్‌గూడలోని ఓ మెస్‌ నిర్వాహకుడు పేర్కొన్నారు. చాయ్‌ ధరను రూ.10 నుంచి రూ.15కు పెంచాల్సి వచ్చిందని ఉప్పల్‌లోని ఓ టీస్టాల్‌ నిర్వాహకురాలు తెలిపారు. గతంలో తమ వద్ద టిఫిన్లు, భోజనం చేసేవారితోపాటు ఇతర ప్రాంతాలకు రెండు, మూడు ఆర్డర్లు పంపేవారమని.. కానీ ఇప్పుడు ఆర్డర్లు తీసుకోవడం లేదని మాదాపూర్‌కు చెందిన కేటరింగ్‌ యూనిట్‌ నిర్వాహకుడు రామేశ్వర్‌ తెలిపారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ


హోటల్‌ నడపడం కష్టంగా ఉంది

వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచడం, పెంచినా సరిపడా దొరకకపోవడంతో హోటల్‌ నడిపించడం కష్టంగా ఉంది. వినియోగదారులను వదులుకోలేక కరెంట్‌ పొయ్యిలు పెట్టి వంటకాలు చేయాల్సి వస్తోంది. ఇలాగే కొనసాగితే హోటల్‌ను ఎప్పుడు మూసివేయాల్సి వస్తుందో తెలియదు.

- సుధాకర్‌రావు, రసోధ ది అథెంటిక్‌ హోటల్‌, కామినేని చౌరస్తా

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆహార పరిశ్రమ లెక్కలివీ..

  • పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు: సుమారు 12,500

  • మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లు, కేటరింగ్‌ యూనిట్లు, తోపుడు బండ్లు: సుమారు 50-60వేలు

  • గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో హాస్టళ్లు: 15,000

  • మొత్తం వాణిజ్య ఎల్పీజీ కనెక్షన్లు: 8.15 లక్షలు

  • రోజూ వినియోగించే వాణిజ్య సిలిండర్లు: 65,000

  • ఆహార పరిశ్రమలో పనిచేస్తున్నవారు: సుమారు 6-8 లక్షలు

Updated Date - May 03 , 2026 | 05:37 AM