kumaram bheem asifabad- విద్యార్థులకు పాఠం చెప్పిన కలెక్టర్
ABN , Publish Date - Jul 23 , 2026 | 10:33 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆసిఫాబాద్ మండలం వావుదాం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆసిఫాబాద్ మండలం వావుదాం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థులతో మమెకమై పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు చాక్లెట్లు అందించి అభినందిస్తూ ఉత్సహ పరిచారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థినిని తొమ్మిదో ఎక్కం చదవమని కలెక్టర్ అడిగారు. విద్యార్థిని గడగడ చదివి వినిపించడంతో కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 85.94 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. మిగిలిన 14 శాతం పూర్తి చేసి 100 శాతం అయ్యేలా రాజకీయ పార్టీలు, మున్సిపల్ పాలక వర్గాలు సహకరించాలని తెలిపారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలలో ఇంకా చాలా మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందించాలని ఫారాలు బీఎల్‌ఓలకు అందించని వారి ఓటు కొల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఫారాలు అందించనివారి జాబితా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వారిని గుర్తించి ఫారాలు అందించేల రాజకీయ పార్టీలు దృష్టి సారించాలన్నారు. మరణించిన, గ్రామం వదిలి వెళ్లిన వారి జాబితాను సిద్ధం చేయనున్నామని తెలిపారు. నిర్ణీత గడువుకు ముందే 100 శాతం డిజిటలైజేషన్ అయ్యేలా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్లు ఆకాష్, షాహిన్ సుల్తానా, ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.