Share News

దగ్గు మందు మత్తులో యువత భవిత చిత్తు

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:40 AM

సాధారణంగా దగ్గు నివారణ కోసం వాడే కొన్ని సిర్‌పలు.. యువతను మత్తులో ముంచెత్తుతున్నాయి. వారి భవిష్యత్తును ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. చాలాకాలంగా ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా సాగుతున్న.....

దగ్గు మందు మత్తులో యువత భవిత చిత్తు

  • యూపీ కేంద్రంగా పెచ్చరిల్లుతున్న కోడీన్‌ మాఫియా.. లక్షల సీసాలు సీజ్‌.. సరిహద్దులు దాటుతున్న దందా

  • ఇతర రాష్ట్రాలకూ లింకు.. రాష్ట్రంలో తరచూ తనిఖీలు

  • అక్రమ విక్రయదారులపై పలు కేసులు

  • 8నిత్యం వాడితే అనారోగ్యం బారిన పడే ముప్పుంటుందని వైద్యుల హెచ్చరిక

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా దగ్గు నివారణ కోసం వాడే కొన్ని సిర్‌పలు.. యువతను మత్తులో ముంచెత్తుతున్నాయి. వారి భవిష్యత్తును ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. చాలాకాలంగా ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా సాగుతున్న ఈ కోడీన్‌ సిరప్‌ మాఫియా ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలకు పాకి యువతను నిర్వీర్యం చేస్తోంది. చదువుకునే వయసులోని కుర్రాళ్లు, రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు.. ఈ ‘సిరప్‌’ మత్తులో తూలుతున్నారు. సాధారణంగా దగ్గు నివారణకు వాడే కోడీన్‌ సిరప్‌ ధర బహిరంగ మార్కెట్లో రూ.120 నుంచి రూ.180 వరకు ఉంటుంది. కానీ ఈ చీకటి వ్యాపారంలో ఒక్కో సీసా నుంచి తీసే ‘షాట్‌’నూ (చిన్న మోతాదు) రూ.40 నుంచి రూ.60 దాకా అమ్ముతున్నారు. దీనికి అలవాటుపడ్డ వారి వల్ల ఒక్కో దుకాణంలో రాత్రికి రాత్రే 20 నుంచి 25 సీసాలు ఖాళీ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో అక్కడి పోలీసు, నార్కొటిక్‌ విభాగపు అధికారులు చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఆ రాష్ట్రంలో ఒక్క నగరానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు. లఖ్‌నవూ నుంచి రాంచీ వరకు, పట్నా నుంచి బంగ్లాదేశ్‌ సరిహద్దుల వరకూ.. ఈ మత్తు సామ్రాజ్యం విస్తరించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. కోడీన్‌ సరఫరా ఎలా చేయాలనే విషయంలో ఈ ముఠాలు నకిలీ కంపెనీలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణాలోని ఫ్యాక్టరీలలో ఈ దగ్గు మందులు తయారీ అవుతున్నాయి. అక్కడి నుంచే ఈ మందులు బయలుదేరుతున్నట్లు గుర్తించారు. యూపీ, బీహార్‌, బెంగాల్‌ మీదుగా చివరకు బంగ్లాదేశ్‌ సరిహద్దులకు చేరుతున్నట్లు తేల్చారు. కోడీన్‌కు వైద్యపరంగా ఆమోదం ఉంది. దశాబ్దాలుగా వైద్యులు దీనినితీవ్ర దగ్గు, శస్త్రచికిత్స అనంతర నొప్పులకు సూచిస్తున్నారు. దీనిని షెడ్యూల్‌- హెచ్‌ ఔషధంగా వర్గీకరించారు. డ్రగ్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ ప్రకారం... ఈ విభాగంలో ఉన్న మందులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న వైద్యుడు ఇచ్చినప్రిస్ర్కిప్షన్‌ లేకుండా విక్రయించకూడదు. ఎవరికి విక్రయించారో రిజిస్టర్‌లో నమోదు చేయాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు.


ఐదుసార్లు చేతులు మారి..

‘సిరప్‌’ మత్తు రాకెట్‌ను నిర్వాహకులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ మందు.. హోల్‌సేల్‌ నుంచి రీటైలర్‌కు చేరేలోపు ఐదుసార్లు చేతులు మారుతున్నట్లు.. యూపీ పోలీసులు, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జరిపిన దాడుల్లో వెల్లడైంది. తనిఖీల్లో సుమారు 3.5 లక్షల బాటిళ్లను సీజ్‌ చేశామని, వాటి విలువ దాదాపు రూ. 3.5 కోట్లని అధికారులు వెల్లడించారు. వారణాసికి చెందిన శుభమ్‌ జైస్వాల్‌ అనే వ్యక్తి ఈ రాకెట్‌కు కింగ్‌పిన్‌ అని తేలింది. ఇతడు ప్రస్తుతం విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని దాడులు చేసినా.. ఫార్మా రంగంలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ మత్తు రాకెట్‌ ఇంకా తన కోరలు చాస్తూనే ఉంది. ఇకనైనా కఠిన చర్యలు తీసుకోకపోతే భావి భారత పౌరులు మత్తు ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

తెలంగాణలో ఉక్కుపాదం

రాష్ట్రంలో దగ్గు మందులను అక్రమంగా వినియోగించే వారిపై రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరిస్తోంది. అధికారులు ప్రతి నెలా ఒకటి రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మందుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. గతనెల హైదరాబాద్‌ నగరంలో మందుల దుకాణానికి చెందిన ఒక మహిళ.. కోడీన్‌కు అలవాటు పడిన వారిని గుర్తించి, వారికి అక్రమంగా దాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. లోతుగా విచారించగా.. ఆమె భర్తకు ఫార్మా లైసెన్స్‌ ఉందని, దాంతో ఈ సిర్‌పలను తయారు చేస్తున్నారని గుర్తించి, ఆ లైసెన్స్‌ను రద్దు చేసి, కేసులు నమోదు చేశారు.


నిత్యం తనిఖీలు చేస్తున్నాం

తెలంగాణవ్యాప్తంగా నిత్యం తనిఖీలు చేపడుతున్నాం. మనదగ్గర కోడీన్‌ను అక్రమంగా విక్రయించే పరిస్థితులు లేవు. ఒకటి రెండు ఘటనల్లో లైసెన్స్‌ రద్దు చేశాం. మత్తును అలవాటు చేసే ఔషధాల విక్రయాల విషయంలో చాలా అప్రమత్తతతో ఉన్నాం. దగ్గు మందును కేవలం వైద్యులు సిఫారసు చేస్తేనే విక్రయించాలని మందుల దుకాణాల యాజమాన్యాలను హెచ్చరించాం.

- రాందాన్‌, డైరెక్టర్‌, రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం, హైదరాబాద్‌

కోడీన్‌తో అనారోగ్య సమస్యలు

కోడీన్‌ ఉన్న దగ్గుమందును తరచూ తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాలేయం పనితీరు దెబ్బతింటుంది. నాడీ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతింటాయి. అన్ని అవయవాలపైనా దాని ప్రభావం తీవ్రంగా పడి.. త్వరగా వృద్ధాప్యం వస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో మత్తుమందు పనిచేయదు. ఎక్కువ మోతాదు ఇవ్వాల్సి వస్తుంది. సహజంగా శరీరం కొంతమేరకు నొప్పులను తట్టుకుంటుంది. దీన్ని వాడి, ఆపేసిన తర్వాత మన శరీరం చిన్నపాటి నొప్పిని కూడా తట్టుకోలేదు.

- డాక్టర్‌ మాదాల కిరణ్‌, మత్తుమందు వైద్యులు, గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్‌

Updated Date - Jan 27 , 2026 | 10:37 AM