బొగ్గు కుంభకోణం అవాస్తవం: కూనంనేని
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:34 AM
బొగ్గు కుంభకోణం జరిగిందంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని సీపీఐ ్ట రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
మణుగూరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): బొగ్గు కుంభకోణం జరిగిందంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని సీపీఐ ్ట రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఆ ఆరోపణల వల్ల కార్మికుల్లో లేనిపోని భయాలు, ఆందోళనలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏఐటీయూసీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ మణుగూరు’ రెండు రోజుల నిరసన దీక్షను సోమవారం కూనంనేని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గును దొంగతనంగా అమ్ముకోవడం అనేది పూర్తిగా అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మైనింగ్ ప్రాంతాలను సందర్శిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారాల వల్ల కార్మికుల్లో ఆభద్రతాభావం నెలకొంటోందని విమర్శించారు. ఇలాంటి ప్రచారాలను మానుకుని ఆ పార్టీలు సింగరేణి పరిరక్షణ ప్రాంతాల మనుగడ కోసం ప్రయత్నాలు సాగించాలని హితవు పలికారు.