సీఎన్‌జీ తిప్పలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:37 AM
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సహజవాయువు దిగుమతులు తగ్గడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్..
సరఫరా తగ్గటంతో 40 శాతం మేర నిలిచిపోయిన వాహనాలు
బంకుల్లో కిలోమీటర్ల కొద్దీ ఆటోలు, క్యాబ్‌ల క్యూ
ఇష్టారీతిన వసూలు చేస్తున్న బంకుల నిర్వాహకులు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్ర జ్యోతి): ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సహజవాయువు దిగుమతులు తగ్గడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వినియోగం రోజుకు దాదాపు 4 లక్షల కిలోలు ఉన్నట్లు అంచనా. పెట్రోల్, డీజిల్ ధరలతో పోల్చితే సీఎన్‌జీ చౌకగా ఉండటంతో గత రెండు మూడేళ్లలో సీఎన్‌జీ వాహనాల వినియోగం పెరిగింది. ఆటోలు, క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీ వాహనాలు నడిపేవారు కూడా సీఎన్‌జీ వైపు మొగ్గుతున్నారు. రాష్ట్రంలో సుమారు 150 బంకుల్లో సీఎన్‌జీ అందుబాటులో ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే సీఎన్‌జీ వాహనాలు 1.5 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 35 నుంచి 40 శాతం సీఎన్‌జీ వాహనాలు నిలిచిపోయాయి. పలు సీఎన్‌జీ బంకులు నోస్టాక్ బోర్డులు పెడుతున్నాయి. అందుబాటులో ఉన్న బంకుల వద్ద చాంతాడంత లైన్లలో 7-8 గంటల వరకూ వేచి చూసే పరిస్థితి నెలకొంది. సీఎన్‌జీ వినియోగం అధికమవుతున్నా అందుకు తగిన విధంగా ఉత్పత్తి, సరఫరా పెరగకపోవటం సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. గ్యాస్ స్టేషన్లకు పైపులైన్ల ద్వారా కాకుండా.. ట్యాంకుల ద్వారా గ్యాస్ సరఫరా చేయటంతో రవాణా పరమైన జాప్యం ఇబ్బందికరంగా మారిందని గ్యాస్‌స్టేషన్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో ఉండటంతో తగినన్ని ట్రిప్పులు వేయలేకపోతున్నామని క్యాబ్‌లు, ఆటోల డ్రైవర్లు వాపోతున్నారు. దీనికి తోడు ఓలా, ఉబర్ , ర్యాపిడో యాప్‌లు.. రోజువారీ లక్ష్యాలను చేరుకోలేని క్యాబ్, ఆటో వాలాలను బ్లాక్ చేస్తోంది. ఫలితంగా, రోజువారీ ఆదాయంలో 40 శాతం దాకా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని క్యాబ్, ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. యుద్ధం మొదలయ్యాక సీఎన్‌జీ ధర కిలోకు రూ.30-50 వరకు పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే గ్యాస్ కేటాయింపులు పెంచి.. ధరలు నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చార్జీలు పెంచిన ఫుడ్ డెలివరీ యాప్‌లు
గ్యాస్ కొరత వల్ల ఏర్పడిన సంకోభంతో పెరిగిన రవాణా ఖర్చుల కారణంగా ఫుడ్ డెలివరీ యాప్‌లు ఛార్జీలను అధికంగా వసూలు చేస్తున్నాయి. సీఎన్‌జీతో నడిచే క్యాబ్, ఆటోల చార్జీల్లోనూ పెంపు కనిపిస్తోంది. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే గ్యాస్ కంపెనీలు(ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్) అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఎక్కువ ధరకు గ్యాస్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆ భారం కూడా చివరకు వినియోగదారులపైనే పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గ్యాస్ కొరత వల్ల సీఎన్‌జీ ధరలు ఒక్కో బంకులో ఒక్కో విధంగా ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ మీదనే 15-20 శాతం ధర పెంచి గ్యాస్ స్టేషన్ల నిర్వాహకులు వసూలు చేస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారు.
ఎల్‌పీజీ సరఫరా పెంచండి
పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
రాష్ట్రంలో ఆటో ఎల్‌పీజీ సరఫరాను పెంచాలని పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రైవేటు ఆటో ఎల్‌పీజీ మార్కెటింగ్ కంపెనీలకు సూచించారు. హైదరాబాద్‌లో ఏజిస్, సూపర్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ గ్యాస్, ఎక్స్‌ట్రా, యుని గ్యాస్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 గ్యాస్ బంకుల్లో దాదాపు 80 శాతం ప్రైవేటు కంపెనీలకే ఉన్న నేపథ్యంలో ఎల్‌పీజీ దిగుమతిని పెంచాలని వారిని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్యాస్ సరఫరాను మరింత పెంచాలని.. విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.