BJP state president R. Chandrashekhar Rao: ఉపాధిపై సీఎం తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:56 AM
మునిసిపాలిటీల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని గుర్తించి ఉపాధి(వీబీ-జీరామ్‌జీ) పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజం
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని గుర్తించి ఉపాధి(వీబీ-జీరామ్‌జీ) పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. ఉపాధి పథకం గురించి పదేపదే మాట్లాడుతున్న రేవంత్.. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం ఎవరిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ సన్నబియ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బియ్యం బ్యాగులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు ముద్రించడం లేదని నిలదీశారు. రేషన్ బియ్యం బ్యాగులపై ఇందిరాగాంధీ ఫొటో ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం..పేదలకు బొమ్మరిల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జోస్యం చెప్పారు. చర్చల ద్వారానే జల వివాదాలు పరిష్కరించుకోవాలన్న వైఖరిపై కాంగ్రె్‌సకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్నితాము ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయాలన్నదే కేంద్రం వైఖరి అని చెప్పారు.