Nizamabad Jail: అసలేం జరుగుతోంది...!
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:31 AM
నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గంజాయి దొరికిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుంది.
జైల్లో గంజాయి ఘటనపై సీఎంవో ఆరా
రహస్య విచారణకు రంగంలోకి ఈగల్ బృందం
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గంజాయి దొరికిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లల్లో గంజాయి, సిగరెట్, బీడీలు, గుట్కా వంటి నిషిద్ధ వస్తువుల వాడకం, సరఫరా, విక్రయాల వంటి వ్యవహారాలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని యాంటీ డ్రగ్స్ ప్రత్యేక విభాగం ‘ఈగల్’ బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది. సీఎంవో ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఈగల్ బృందం.. జైలు అధికారులు, సిబ్బందితో పాటు ఇటీవల జైలు నుంచి విడుదలైన ఖైదీల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే జైలు క్యాంటీన్లలో బీడీల విక్రయాన్ని నిషేధించినా.. జైలు సిబ్బంది కొందరు, ఖైదీలను మచ్చిక చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వీటిని అధిక ధరలకు అమ్ముతూ దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపైనా ఈగల్ బృందం విచారణ జరపనుంది. సంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జైళ్లల్లో ములాఖత్‌ల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా సదుపాయాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు.
జైళ్ల శాఖ ప్రక్షాళన..శ్రీ భారీగా బదిలీలకు రంగం సిద్ధం
రాష్ట్ర జైళ్ల శాఖలో సమూల మార్పులకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేఽశారు. ఇటీవల కాలంలో జరిగిన వరుస పరిణామాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా భారీస్థాయిలో బదిలీలకు చర్యలు చేపట్టారు. పలు జైళ్ల సూపరింటెండెంట్లతో పాటు డీఐజీ స్థాయి అధికారుల్ని వారి సర్వీసు రికార్డు, పనితీరు ఆధారంగా కొత్త పోస్టుల్లో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందికి స్థానచలనం కల్పించనున్నారు. బదిలీలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.