CM Reviews Medaram Jatara: కాలినడకన.. బస్సులో తిరుగుతూ..
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:42 AM
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. మంత్రులతో కలిసి బస్సులో జంపన్నవాగు, ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించారు.
మేడారం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానించిన ఆదివాసీలు.. కాలినడకన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు రేవంత్‌రెడ్డి
అభివృద్ధి పనులపై ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.. బస్సులో తిరుగుతూ పరిశీలించిన సీఎం, మంత్రులు
ములుగు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. మంత్రులతో కలిసి బస్సులో జంపన్నవాగు, ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించారు. అనంతరం అక్కడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన హామీ ఇచ్చిన మేరకు రూ.150 కోట్లతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను చేపట్టారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం మేడారం పర్యటన చేపట్టారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో హెలికాప్టర్‌లో సీఎం మేడారానికి చేరుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆదివాసీలు డోలు వాయిద్యాలు, కొమ్ము బూరలు, కోయ నృత్యాలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అంతా కాలినడకన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జాతర అభివృద్ధి పనులు, ఏర్పాట్లపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో మంత్రులతో కలిసి బస్సులో అభివృద్ధి పనులను పరిశీలిస్తూ జంపన్న వాగు మీదుగా స్తూపం వరకు వెళ్లి.. వెనక్కి తిరిగి హరిత హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సుందరీకరణ పనులను పరిశీలించి, మంత్రులతో కలిసి ఫొటోలు దిగారు.