CM Revanth District Tours: పండగ తర్వాత పుర పోరు!
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:40 AM
సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్రంలో పుర పోరుకు తెరలేవనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకూ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్దమైంది....
ఈ నెల చివరివారంలో షెడ్యూల్ విడుదల..!
ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం
అదే నెల 3 నుంచి రేవంత్ జిల్లాల పర్యటనలు
ప్రచారమూ కలిసొచ్చేలా సీఎం అభివృద్ధి కార్యక్రమాలు
జనవరి 19న దావో్‌సకు సీఎం... అట్నుంచి అమెరికాకు
హైదరాబాద్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్రంలో పుర పోరుకు తెరలేవనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకూ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ నెల చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మద్దతు ప్రభుత్వానికే ఉందంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలూ నిర్వహించి పట్టణ ప్రాంత ప్రజల మద్దతూ ప్రభుత్వానికి ఉందని నిరూపించుకునే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలకు తెరలేపినట్లు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ మినహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం పర్యటనలు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారమూ కలిసొచ్చే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు పెట్టుకున్నారు. ఒక్కో ఉమ్మడి జిల్లాలో ఒక్కో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని సమీప గ్రామంలో ఏర్పాటు చేసిన సభల ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 3న జడ్చర్ల నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ ఇన్‌స్టిట్యూట్ ఏ మున్సిపాలిటీ పరిధిలోకీ రాదు. కానీ శంఖుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి సందేశం ఇవ్వనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సభల ద్వారా సందేశం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
19న దావోస్ టు అమెరికా
రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ కోసం ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి దావో్‌సకు వెళ్లనున్నారు. ప్రతి ఏడు లాగే ఈ ఏడాదీ అక్కడ జరిగే సదస్సులో పాల్గొంటున్నారు. దావో్‌సలో పెట్టుబడుల సదస్సు ముగిసిన తర్వాత అటు నుంచి అటు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు సీఎం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పర్యటనా పెట్టుబడుల సమీకరణ కోసమేనని చెబుతున్నారు. అయితే ఈ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. అమెరికా పర్యటనా ఖరారైతే సీఎం రేవంత్‌రెడ్డి ఆ పర్యటన ముగించుకుని ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. ఆ తర్వాత జిల్లా పర్యటనల్లో పాలు పంచుకుంటారు. కాగా.. శనివారం శాసనసభ వాయిదా పడగానే సీఎం రేవంత్‌రెడ్డి ముంబయికి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమీప బంధువు ఒకరిని పరామర్శించి వెంటనే హైదరాబాద్‌కు చేరుకుంటారు.