Share News

తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం!

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:52 AM

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహెట్టి బరాజ్‌ ఎత్తుపై చర్చిద్దామని పేర్కొంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‪కు...

తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం!

  • ఉత్తర తెలంగాణ అవసరాలకు 148 మీటర్ల ఎత్తు సరిపోదు

  • గ్రావిటీతో నీటి తరలింపునకు ఎత్తు పెంచడం అవసరం

  • మీ రాష్ట్రంలో మునిగే ప్రాంతం చాలా స్వల్పం.. సహకరించండి

  • మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‪కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహెట్టి బరాజ్‌ ఎత్తుపై చర్చిద్దామని పేర్కొంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‪కు సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. గత నెల 6వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాసిన లేఖకు కొనసాగింపుగా సోమవారం ఈ లేఖను సీఎం పంపించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు 2016 ఆగస్టు 23న జరిగిన అంతరాష్ట్ర బోర్డు సమావేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సీఎం గుర్తుచేశారు. తొలుత ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తుకు బదులు 148 మీటర్ల ఎత్తుతో బరాజ్‌ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌లలోని పలు ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేమని ఇటీవల నిర్వహించిన సమీక్షలో నిపుణులు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. బరాజ్‌ ఎత్తును 148 మీటర్ల కంటే కొంత మేర పెంచితే మహారాష్ట్ర భూభాగంలో అదనంగా మునిగే ప్రాంతం చాలా స్వల్పమేనని తెలిపారు. దీనివల్ల తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించడానికి గొప్ప సౌలభ్యం లభిస్తుందని, మరింత సమర్థవంతంగా, స్థిరంగా నీటిని వినియోగించుకోవచ్చన్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పరస్పర అంగీకారంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఒక నిర్ణయానికి వద్దామని సీఎం రేవంత్‌రెడ్డి ఫడణవీ్‌సకు సూచించారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించి వీలైనంత త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరారు.

Updated Date - Jun 09 , 2026 | 04:52 AM