సెలబ్రిటీలైనా చంచల్‌గూడకే..!
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:02 AM
మాదకద్రవ్యాల వినియోగం కేసుల్లో ఎంత పెద్ద స్థాయి వారు ఉన్నా వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, పెద్ద స్థాయి అధికారులు, సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులున్నా కచ్చితంగా...
డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలం
మహిళలపై హింస కేసుల్లో 80 శాతం మత్తు బానిసలే
‘స్పందన’ ప్రారంభంలో సీఎం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల వినియోగం కేసుల్లో ఎంత పెద్ద స్థాయి వారు ఉన్నా వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, పెద్ద స్థాయి అధికారులు, సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులున్నా కచ్చితంగా అరెస్టు చేసి జైల్లో పడేయాలని పోలీసులను అదేశించారు. పెద్దవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే.. మిగతావారిలో భయం కలుగుతుందని అన్నారు. మహిళలపై హింస, నేరాలకు పాల్పడుతున్న వారిలో 80 శాతం డ్రగ్స్, గంజాయి బానిసలే ఉంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్పందన- తక్షణ రక్షణ’ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఆయన ప్రారంభించారు. ‘స్పందన-తక్షణ రక్షణ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ‘ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం పౌరుషానికి ప్రతీక. ఇప్పుడు డ్రగ్స్ మత్తులో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణకు ఆ పరిస్థితి రావొద్దు. మత కలహాలు జరగకుండా గతంలో కీలక పాత్ర పోషించిన పీస్ కమిటీలను మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములను చేయాలి’ అని సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో చేరుతున్న సమయంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని, అందుకోసం అడ్మిషన్ ఫారంలో ప్రత్యేకంగా ఒక కాలమ్‌ను చేర్చాలని కోరారు. హైదరాబాద్‌లో ఆపదలో ఉన్న మహిళలు డయల్-100, 112కు ఫోన్ చేస్తే.. స్పందన టీమ్ వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. మహిళా సాధికారతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగాలి: సీతక్క
అన్యాయానికి, లైంగిక వేధింపులకు గురవుతున్న బాధితులు, ఆడబిడ్డలకు తక్షణ రక్షణ కల్పించేందుకుపోలీసులు స్పందనను అందబాటులోకి తేవటం అభినందనీయమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గోల్డెన్ అవర్‌లోనే బాధితులకు సాంత్వన చేకూర్చటం స్పందన ముఖ్య లక్ష్యమన్నారు. అన్యాయం జరిగిన మహిళలు తలెత్తుకొని తిరిగేలా పోలీసులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. స్పందన- తక్షణ రక్షణ దేశంలోనే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతి జోన్‌కు రెండు స్పందన వాహనాల చొప్పున 14 బృందాలను అందుబాబులోకి తెచ్చినట్లు చెప్పారు. వాహనాల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు, డ్రాగన్ లైట్లు, అత్యవసర వైద్య కిట్లు, వీహెచ్‌ఎఫ్ వైర్‌లెస్ సెట్లు, ట్యాబ్లెట్లు, డిజిటల్ కెమెరాల వంటి పరికరాలను ప్రభుత్వం సమకూర్చిందని చెప్పారు.