పని చేయలేకపోతే తప్పుకోండి!
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:57 AM
ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిందని, ఎవరి పనితీరు ఎలా ఉందో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుతిమెత్తగా హెచ్చరించారు.
సెలవులో వెళ్లినా అభ్యంతరం లేదు
లూప్‌లైన్ పోస్టు కావాలంటే పంపిస్తా
అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేసుకోవడమూ నాకు తెలుసు
కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా రిటైర్మెంట్.. అవసరమైతే దాన్నీ పరిశీలిస్తా
పనిచేయని అధికారుల వివరాలను
ఈనెల 4వ తేదీన బయటపెడతా.. ఐఏఎస్‌లకు సీఎం హెచ్చరిక
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిందని, ఎవరి పనితీరు ఎలా ఉందో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుతిమెత్తగా హెచ్చరించారు. పని చేయలేమని భావించే అధికారులు పక్కకు తప్పుకోవాలని, వీలైతే సెలవులో పోయినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కీలక బాధ్యతలను నిర్వర్తించలేమని భావించే అధికారులు లూప్‌లైన్ పోస్టు కావాలనుకుంటే అక్కడికే పంపుతామని తేల్చి చెప్పారని తెలిసింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ‘‘ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు పని చేయడం లేదనే సమాచారం నా దగ్గర ఉంది. పని చేయని అధికారుల వ్యక్తిగత వివరాలను 4వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో బయట పెడతాను’’ అని స్పష్టం చేశారు. ఆరోజు ప్రతి అధికారి పనితీరు ఎలా ఉందో చర్చిస్తానని చెప్పారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ శనివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గడచిన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకున్నామని, ఇకపై ఫలితాలు చూపించాలని సూచించారు. ప్రతి ఎన్నికలో కావాల్సినంత బలాన్ని ప్రజలు తనకుఇస్తున్నప్పుడు.. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని వారికి మంచి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడబోదని హెచ్చరించినట్లు తెలిసింది. సమావేశమంతా కార్యదర్శుల పనితీరు చుట్టే జరిగిందని సమాచారం.
గుర్తుంచుకునేలా పనిచేయండి
ఐఏఎ్‌సలుగా మీరు రిటైరైన తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకునేలా పని చేయాలంటూ సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. సీఎం కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్న విధంగానే, అధికారులుగా మీరు ఒక లక్ష్యం పెట్టుకుని అది సాకారమయ్యే దిశగా సాగాలని సూచించారని సమాచారం. పనితీరు బాగాలేని ఐఏఎ్‌సలను కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా పదవీ విరమణ చేయించారని, తీరు మార్చుకోకపోతే ఆ అంశంపైనా పరిశీలన చేస్తామని నవ్వుతూనే చురకలు అంటించినట్టు తెలిసింది. కొన్ని శాఖల పరిధిలో ఆన్‌లైన్ విధానంలో వచ్చిన దరఖాస్తులను దగ్గర పెట్టుకుని, సంబంధిత వ్యక్తులను పిలిపించుకుని మాట్లాడుతున్నారని, అందుకు సంబంధించిన డేటా మొత్తం తన దగ్గరుందని, అవసరమైనప్పుడు ఆ వివరాలు బయటపెడతాననిహెచ్చరించారు. కొన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయమే ఉండడం లేదని, వారిని సమన్వయం చేయడానికే తనకు సమయం పడుతోందని అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఇకపై అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవకుండా చూసుకోవాలని సూచించారు. సమావేశం ముగిసే సమయంలో ‘ఇవ్వాళంతా బాగా రెస్ట్ తీసుకోండి.. రేపటి నుంచి బాగా పనిచేయండి’ అని నవ్వుతూనే సూచించారని సమాచారం.
ప్రజలకు మరింత చేరువగా పథకాలు
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి ఆరు నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులపాటు దీనిని అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని, కార్యక్రమం అమలుకు ‘ప్రత్యేక లోగో’ తయారు చేయాలని నిర్దేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఫైళ్లలో ఉన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారాలని, పథకాల ప్రయోజనం ప్రత్యక్షంగా ప్రజలకు చేరే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు కాంగ్రెస్‌పై చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతోపాటు అధికారులందరిపైనా ఉందన్నారు.
ప్రజలు ఆఫీసులకు రాకుండానే సేవలు
పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.‘‘ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సంస్కరణలు తీసుకురావాలి. కరెంట్ మీటర్, ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొద లు అన్ని సేవలు, అనుమతులు ప్రజలు ఆఫీసులకు రాకుండానే జరగాలి. వాహనం కొన్న షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చింది. ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలి. ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయాస విధానం ఉండాలి’’ అని నిర్దేశించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ఆదేశించారు. 3వారాల్లో కమిటీ నివేదికను అందజేయాలని చెప్పారు. ప్రతి విభాగం ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, సర్వర్లను రాబోయే 20 ఏళ్లకు సరిపడేలా అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తామని, ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి ఐఏఎస్ తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలని, తమంతట తాము గర్వపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని, ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి మాన్యుఫాక్చరింగ్ జోన్ భవిష్యత్తులో కీలకంగా మారుతుందన్నారు. గ్లోబల్ సమ్మిట్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో 8లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అవన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు కార్యాచరణ చేపట్టాలని, అవి గ్రౌండయ్యేంత వరకు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.