Share News

ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య చిచ్చు పెట్టొద్దు

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:28 AM

ఉత్తరాదికీ, దక్షిణాదికీ మధ్య గోడలు కట్టవద్దని.. ఒక్కసారి అంతరాలు ఏర్పడితే వాటిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య చిచ్చు పెట్టొద్దు

  • అంతరాలు ఏర్పడితే నియంత్రించలేం

  • మోదీ, అమిత్‌ షా ఎన్నాళ్లుంటారు?

  • మీ కోసం దేశాన్ని బలహీనం చేయవద్దు

  • మహిళా రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే

  • 543 సీట్లలోనే తక్షణం అమలు చేయండి

  • దక్షిణాది సీఎంలను నేను స్వయంగా ఒప్పిస్తా

  • కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రపతి, ప్రధాని,

  • స్పీకర్‌గా, పార్టీ అధ్యక్షులుగా మహిళలు

  • బీజేపీ అధ్యక్షులుగా, సర్‌సంఘ్‌చాలక్‌గా మహిళలు ఎందుకు నియమితులు కాలేదు?

  • పార్లమెంటులో ఏ బిల్లు మీద ఓటింగ్‌ జరిగినా తలుపులు మూస్తారు.. తేజస్వీకి తెలియదేమో

  • ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాదికీ, దక్షిణాదికీ మధ్య గోడలు కట్టవద్దని.. ఒక్కసారి అంతరాలు ఏర్పడితే వాటిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అందరూ ఈ దేశంలోనే ఉన్నారని, దేశ ప్రగతి కోసం అందరమూ ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘రాజకీయాల్లో ఇవాళ మీరు పైచేయి సాఽధించి అధికారంలో ఉండవచ్చు. కానీ, ఆర్థికంగా దక్షిణాది రాష్ట్రాలదే పైచేయి అనే విషయం మరవద్దు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట ఉత్తరాదిని బలోపేతం చేయాలనే ప్రయత్నం సరైనది కాదు. ఉత్తరాదికీ, దక్షిణాదికీ, చిన్న రాష్ట్రాలకు మధ్య తేడాలు ఉండటం దేశసమైక్యతకే ప్రమాదకరం. ప్రజల మధ్య అపోహలు మొదలైతే వాటిని నియంత్రించలేం. మోదీ, అమిత్‌ షా ఎన్నాళ్లు ఉంటారు? తమకోసం దేశాన్ని బలహీనం చేయవద్దు. అటువంటి ప్రయత్నం చేస్తే బలంగా అడ్డుకుంటాం’ అని తేల్చి చెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌, పునర్విభజన బిల్లులకు.. పార్లమెంటులో విపక్షాల వ్యతిరేకతతో ఆమోదం లభించని విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో, శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. యూపీ, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర.. ఈ ఏడు రాష్ట్రాల్లో గెలుపుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మిగతా రాష్ట్రాల మాటేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలూ భాగస్వాములు కావాలన్నారు. దేశభక్తిలో దక్షిణాది ఎవరికీ తక్కువేం కాదని చాటి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశం ప్రధానమని, ఆ తర్వాత ప్రజలు, చివరకు పార్టీ అని.. ప్రధాని మోదీకి మాత్రం ముందు పార్టీ ప్రధానమని, తర్వాత దేశం, చివరకు ప్రజలని విమర్శించారు. అయితే, మోదీకి అన్నిటికంటే ఆయన ప్రయోజనాలే ముఖ్యమని కొందరు బీజేపీ నేతలు చెబుతుంటారని సీఎం వ్యాఖ్యానించారు.


చిత్తశుద్ధి ఉంటే తక్షణం అమలు చేయండి

బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని, అదే ప్రాతిపదికన అసెంబ్లీలలో సీట్లు కూడా రిజర్వు చేయాలని.. సోమవారమే కొత్త చట్టం చేసి మంగళవారం నుంచి అమలు చేయాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దేశం కోసం మహిళలకు సీట్లు త్యాగం చేస్తామని, స్వయంగా తన నియోజకవర్గాన్ని మహిళలకు కేటాయించినా సమ్మతమేనని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నుంచే అమలు చేయాలని అన్నారు 1971 నుంచి 2011 వరకు జరిగిన ఏ జనాభా లెక్కలనైనా ప్రాతిపదికగా తీసుకోవచ్చని, పునర్విభజన కూడా అవసరం లేదని చెప్పారు. డాటా సిద్ధంగా ఉందని, ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, తాను దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందర్నీ ఒప్పిస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం మహిళలకు సీట్లు కేటాయించటం కాదన్నారు. ‘మహిళా కోటా పేరుతో లోక్‌సభలో సీట్లు పెంచుకుని అధిక మెజారిటీ సాధించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకున్న రిజర్వేషన్లను తొలగించేందుకు నరేంద్రమోదీ ప్రయత్నించారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే ఈ పాటికి రాజ్యాంగాన్ని మార్చేవారు. ప్రజలు ఆ కుట్రను కనిపెట్టి ఆయనను కేవలం 240 సీట్లకే పరిమితం చేశారు. మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్లీ రాజ్యాంగాన్ని తిరగరాసేందుకు మహిళా రిజర్వేషన్‌ ముసుగులో ప్రయత్నించారు. కానీ ప్రజలు, విపక్షాలు ఆయనకు లోక్‌సభలో గుణపాఠం చెప్పాయి’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ సీట్లను పెంచేందుకు జనాభా ప్రాతిపదికను గానీ, ప్రొరాటా విధానాన్నిగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. కేంద్ర విధానాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు జనాభాను తగ్గించాయని, అందుకు అభినందించాలేగానీ శిక్షించకూడదని చెప్పారు.


ఇది బీజేపీ ఓటమి

లోక్‌సభలో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం బీజేపీ చిత్తశుద్ధి లేమికి ఎదురైన ఓటమి అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు స్వచ్ఛమైన మనసుతో ఆలోచించి ఉంటే మహిళలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రత్యేకంగా బిల్లు తీసుకొచ్చేవారన్నారు. 2023లో ఆమోదించిన బిల్లుకే కొన్ని చిన్న సవరణలు చేస్తే సరిపోయేదని చెప్పారు. ఓబీసీలకు కూడా రిజర్వేషన్‌ కల్పించాలన్నది తమ అభిప్రాయమని, కానీ, సమయం లేదనుకుంటే వెంటనే మహిళా రిజర్వేషన్‌ కల్పించి వచ్చే ఏడాది నుంచే అమలు చేయవచ్చన్నారు. తమకు ఉత్తరాది వారు కూడా మద్దతిచ్చారని, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తమ వాదనను సమర్థించారని సీఎం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకమని బీజేపీ నేతలు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చిందని, కానీ, స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్‌ మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, గవర్నర్‌ మొదలైన వాటిల్లో మహిళలను ఎన్నుకున్నది కాంగ్రెస్‌ పార్టీయేనని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించింది రాజీవ్‌ గాంధీయేనన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఇందిరాగాంధీ, సోనియాగాంధీ పని చేశారని గుర్తు చేశారు. 1980లో బీజేపీ ఏర్పడిన నాటి నుంచీ 15 మంది ఆ పార్టీ అధ్యక్షులైనప్పటికీ ఒక్క మహిళనూ ఇప్పటి వరకూ అధ్యక్ష పదవిలో నియమించలేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల్లో ఒక్క మహిళను ఇంతవరకూ నియమించలేదని, వందేళ్ల ఆర్‌ఎస్ఎస్‌ చరిత్రలో సర్‌ సంఘ్‌చాలక్‌గా ఒక్కరైనా మహిళ ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నాటకాలు ప్రజలకు బాగా అర్థమయ్యాయని, వారిని ఇక మీదట నమ్మరని చెప్పారు. చట్టసభల్లో సీట్లను పెంచాలనుకుంటే, డీలిమిటేషన్‌ అమలు చేయాలంటే ఇది సరైన పద్ధతి కాదని, అందరితో చర్చించాలని, పౌరసమాజాన్ని కూడా చర్చల్లో భాగస్వామ్యం చేయాలని, ప్రతి జిల్లాలో జనసభలు ఏర్పాటు చేసి అభిప్రాయాల్ని తీసుకోవాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతున్నారు కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ఆయన చెప్పిన ప్రకారం జనాభాను పెంచడానికి 30 ఏళ్లు పడుతుందన్నారు. ‘చంద్రబాబు విజ్ఞుడు, అనుభవజ్ఞుడు, ఆయన తప్పేమీ మాట్లాడరు. అర్థం చేసుకునేవారికి ఆయన మాటల్లో సంకేతాలు చాలు’ అని చెప్పారు.


శకునికి ఏమైందో గుర్తుంచుకోవాలి

ఇప్పటి వరకూ ఎటువంటి చర్చలు లేకుండా పార్లమెంటులో అనేక బిల్లులను ఆమోదింప చేసుకున్నారని, కేసులు పెట్టి భయపెట్టి, సభ్యులను గైర్హాజరు చేయించి బిల్లులను పాస్‌ చేయించుకున్నారని కేంద్ర సర్కారుపై రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహాభారతంలో భీమసేనుడు కూడా గొప్ప యోధున్ని అన్న అహంకారంతో విర్రవీగితే ఓ వృద్ధుడి రూపంలో వచ్చిన హనుమంతుడు బుద్ధి చెప్పి.. అహంకారాన్ని తొలగించారన్నారు. మోదీ అహంకారం కూడా లోక్‌సభలో ప్రజల ముందు ఓడిపోయిందన్నారు. మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకమని మోదీ ప్రచారం చేస్తారు కదా అని అడగ్గా.. మహాభారతంలో శకునికి ఏమైందో చూశారు కదా అని రేవంత్‌ చెప్పటం గమనార్హం. రామయణ భారతాలను చదివి ఎలా వ్యవహరించకూడదో మోదీ నేర్చుకోవాలని చెప్పారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ తనపై చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ, వారిద్దరూ మోదీని సంతోషపెడితే చాలు.. ప్రజలు ఏమైనా ఫర్వాలేదనుకుంటున్నారని చెప్పారు. మోదీ భజన చేస్తే పదవి రాదు.. తెలంగాణలో నంబర్లు రావాలి.. సీట్లు లేకపోతే మోదీ బంట్రోతు పదవికూడా ఇవ్వరన్నారు.

ఓటింగ్‌ సమయంలో తలుపులు మూస్తారు

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యల మీద సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. పార్లమెంటులో ఏ బిల్లు మీద ఓటింగ్‌ జరిగినా తలుపులు మూసే జరుపుతారని, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన తేజస్వీ సూర్యకు ఈ విషయంపై అవగాహన లేనట్టుందన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 05:30 AM