కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:41 AM
మాజీ సీఎం కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఫ్యామిలీ జస్టిస్ చేస్తే.. తాను సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయం) చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఎవరేం చేశామో శాసనసభలో తేల్చుకుందాం రండి
బావ బామ్మర్దులే కాదు.. కేసీఆర్‌నూ తీసుకురావాలి
8.11లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చారు
వాటికి ఏటా 75 వేల కోట్లు వడ్డీలుగా చెల్లిస్తున్నాం
రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశాం
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం
యువతకు రెండున్నరేళ్లలో 70 వేల ఉద్యోగాలిచ్చాం
సొంత చెల్లిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తాడు?
కొడుకు దుర్మార్గాన్ని సరిదిద్దని వ్యక్తి కేసీఆర్
పరకాల, ములుగు సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
వరంగల్/ములుగు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ సీఎం కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఫ్యామిలీ జస్టిస్ చేస్తే.. తాను సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయం) చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తన కొడుకు కేటీఆర్‌ను, అల్లుడు హరీశ్‌ను మంత్రులను చేసుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాగానే సీతక్కను, కొండా సురేఖను మంత్రులను చేశాను. కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇస్తే.. నేను అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇచ్చాను. కేసీఆర్ తన కూతురిని ఎంపీని చేసిండు.. ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిండు. నేను కడియం కావ్యను ఎంపీని చేశాను.. యశస్వినిని ఎమ్మెల్యేను చేశాను. కేసీఆర్ తన సడ్డకుని కొడుకు సంతోష్ రావును రాజ్యసభకు పంపిస్తే.. నేను మిత్రధర్మంతో వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభకు పంపించాను. కేసీఆర్ వినోద్‌రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌ను చేసుకుంటే.. నేను ఉద్యమకారుడు కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తన కొడుకు కేటీఆర్‌ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేసుకున్నాడు. నేను.. మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేశాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అన్ని వర్గాల ప్రజలకు లాభం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో, ములుగు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని హరీశ్‌రావు, కేటీఆర్ కోరుతున్నారని, అయితే సెప్టెంబరులో శాసనసభ నిర్వహిస్తున్నామని, బావబామ్మర్దులే కాకుండా కేసీఆర్‌ను కూడా సభకు తీసుకురావాలని అన్నారు. ‘పదేళ్లలో మీరేం చేశారో.. రెండున్నరేళ్లలో ప్రజలకు మేం ఏం చేశామో తేల్చుకుందాం’ అని సీఎం సవాల్ చేశారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు..
కేసీఆర్ పదేళ్లలో పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. రూ.6,500 వేల కోట్ల అప్పు మాత్రమే ఉన్న రాష్ట్రాన్ని.. కేసీఆర్ వచ్చాక అప్పులపాలు చేసి రూ.8.11 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చారని మండిపడ్డారు. ఆ అప్పులకు వడ్డీ కిందనే ఏటా రూ.75 వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తాను రోజుకు 18 గంటలు పని చేస్తున్నానని, ఏ రోజూ సెలవు తీసుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసినప్పటికీ దేశం లో అత్యధికంగా వరి ధాన్యాన్ని పండిచామని చెప్పారు. 32 నెలల్లో ధాన్యం కొనుగోలుకు రూ.90 వేల కోట్లు రైతులకు చెల్లించామన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం 85 లక్షల మంది రైతులకు రూ.8,617 కోట్లు తొలి విడతలోనే మాఫీ చేశామని వెల్లడించారు.
మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
కేసీఆర్ ఐదేళ్లపాటు మంత్రివర్గంలో మహిళలకు చోటు కూడా కల్పించలేదని, తాను మాత్రం కొండా సురే ఖ, సీతక్కను మంత్రులుగా తీసుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రక్త సంబంధం లేకపోయినా సీతక్కను సొంత సోదరిలా చూసుకుంటున్నానని, కేటీఆర్ మాత్రం జైలుకు వెళ్లివచ్చిన సొంత చెల్లిని ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని బయటకు పంపించారని ఆరోపించారు. కూతురిని బయటకు నెట్టేస్తుంటే కన్నతండ్రి.. ధృతరాష్ర్టుడిలా చూస్తుండిపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, తాజాగా పోలీస్, సివిల్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇక నుంచి దశలవారీగా నోటిఫికేషన్లను ఇస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం రెచ్చగొడితే యువకులు రెచ్చిపోయి ఆందోళనలు చేయొద్దని, పోలీసు కేసుల్లో ఇరుక్కోవద్దని, తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం పెట్టి, చివరికి ఆ రక్తాన్ని కూడా ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారంచేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు తమను ఏమీ చేయలేవని, వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా వెంట్రుక కూడా పీకలేరని అన్నారు.
సొంత చెల్లిని వెళ్లగొట్టిన కేటీఆర్..
రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని మెడపట్టి ఇంట్లోంచి తోసేసిన ఘనుడు కేటీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి.. రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ములుగు జిల్లా కేంద్రంలో స మీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పా టు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కొడుకు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే సరిదిద్దాల్సిన తండ్రి మౌనంగా ఉన్నాడంటే.. ఆ నేరంలో కేసీఆర్‌కూ సగం భాగం ఉన్నట్లేనన్నారు. మరోవైపు హరీశ్‌రావు.. రాష్ట్రంలో కరువు రావాలని, వర్షాలు కురవకూడదని, ప్రజలు చనిపోవాలని తమిళనాడు, కర్ణాటక వెళ్లి క్షుద్రపూజలు, చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే వారు ఎన్ని పూజలు చేసినా దేవుడు తమ వైపే ఉన్నాడన్నారు. రామప్ప, వేయిస్తంభాల గుడి తరహాలోనే మేడారాన్ని ప్రపంచస్థాయి పర్యాటక క్షే త్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. జంపన్నవాగు, మల్లూ రు ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ తదితరులు మాట్లాడారు.