Share News

తుంగభద్ర జలాల సాధనలో రాజీలేదు

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:17 AM

తుంగభద్ర జలాల సాధనలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక, ఏపీలను ఒప్పించి ఆర్డీఎస్‌...

తుంగభద్ర జలాల సాధనలో రాజీలేదు

  • కర్ణాటక, ఏపీలను ఒప్పించి..ఆర్డీఎస్‌లో వాటా సాధించుకుందాం

  • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌

  • కేంద్రం జోక్యం చేసుకోవాలి

  • ఆర్డీఎస్‌లో పూడిక తొలగించాలని, వాటా నీళ్లందేలా చూడాలని విజ్ఞప్తి

  • నేడు తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం

  • హాజరుకానున్న రేవంత్‌, ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాల సాధనలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక, ఏపీలను ఒప్పించి ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌)లో వాటా నీటిని సాధించుకుంటామని తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే.. ఇప్పుడు 5 టీఎంసీలకు మించి రావడం లేదని చెప్పారు. తుంగభద్రలో తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగం, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం సాధించే అంశంలో కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తీసుకోవాలని కోరారు. బుధవారం జలసౌధలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవితో కలిసి తుంగభద్ర డ్యామ్‌తో పాటు ఆర్డీఎ్‌సపై సమీక్షించారు. ఆర్డీఎస్‌ ఆనికట్‌ ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా ఆధునీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టులోని ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని.. ప్యాకేజీ 3, 4 మాత్రం పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనితో తొలి రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలంటూ.. గురువారం తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ముగ్గురు సీఎంలతో జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని రేవంత్‌ నిర్ణయించారు. ఆర్డీఎస్‌ వద్ద పూడిక వల్ల ఆశించినమేర నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు పేర్కొనగా.. వెంటనే పూడికతీత చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయించారు. ఇక తుమ్మిళ్ల నుంచి నీటి వినియోగానికి కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచాలని సూచించారు. తుంగభద్ర జలాల సాధనలో రాజీ ప్రసక్తే లేదన్నారు. ఆర్డీఎ్‌సలో వాటా నీళ్లు అందేలా కర్ణాటక, ఏపీలను ఒప్పిస్తామని చెప్పారు.


ఆర్డీఎస్‌ స్థిరీకరణ కోసం తుమ్మిళ్ల రెండో దశ: ఉత ్తమ్‌

ఆర్డీఎస్‌ కింద ఆయకట్టును స్థిరీకరించడానికి వీలుగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశను కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలో తెలిపారు. ఈ మేరకు భూసేకరణ కోసం చర్యలు చేపట్టాలని, మల్లమ్మకుంట నిల్వ సామర్థ్యాన్ని 6 టీఎంసీలకు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 20 ఏళ్ల వరకు సాగునీటికి ఇబ్బంది రావొద్దని, ఈ మేరకు అన్ని అంశాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

నేడు తుంగభద్రకు సీఎం రేవంత్‌

తుంగభద్ర రిజర్వాయర్‌కు కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ హాజరుకానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కర్ణాటకలోని విజయనగర జిల్లా హోస్పేట్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో కేంద్ర జలశక్తి మంత్రితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు పాల్గొంటున్నారు. కాగా, మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు అవసర మైన భూములను 2013 భూసేకరణ చట్టం కింద కాకుండా తమ సమ్మతితో సేకరించాలంటూ రైతులు బుధవారం సీఎం రేవంత్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎకరానికి తరి పొలానికి రూ.20 లక్షలు, కుష్కికి రూ.16 లక్షల చొప్పున పరిహారం అందించాలని.. సీలింగ్‌, అసైన్డ్‌ భూముల రైతులకూ పరిహారం ఇవ్వాలని కోరారు.

సీఎం రేవంత్‌తో మేఘాలయ సీఎం భేటీ

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కె. సంగ్మా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన వారిలో మేఘాలయ సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రులు స్నియావ్‌ భలాంగ్‌ధర్‌, ప్రెస్టోన్‌ టిన్సాంగ్‌ ఉన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 05:09 AM