నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్
ABN , Publish Date - May 23 , 2026 | 04:34 AM
యాదగిరిగుట్టలోని పెద్దగుట్ట టెంపుల్ సిటీలో వేద విజ్ఞాన వ్యాప్తి కోసం ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీనరసింహ వేదపాఠశాలకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు.
పెద్దగుట్ట టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు భూమిపూజ
రూ.100 కోట్లతో నాలుగు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
యాదాద్రి, మే 22 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్టలోని పెద్దగుట్ట టెంపుల్ సిటీలో వేద విజ్ఞాన వ్యాప్తి కోసం ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీనరసింహ వేదపాఠశాలకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. యాదగిరిగుట్టపై భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరో నాలుగు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి శనివారం ఉదయం 8.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరతారు. ఉదయం 9.10 గంటలకు ఆయన యాదగిరిగుట్ట టెంపుల్‌సిటీలోని హెలీప్యాడ్‌లో దిగి, 9.15కు యాదగిరిగుట్ట పైకి చేరుకుంటారు. అనంతరం ప్రధానాలయంలో లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం కొండపై చేపట్టనున్న స్వామివారి నిత్యకల్యాణ మండపం, దీక్షాపరుల సదన్, ఆలయ మాడవీధులకు వాయువ్య దిశగా మెట్ల నిర్మాణం, కొండకింద వైకుంఠద్వార రాజగోపురం నుంచి కొండపైకి మెట్లమార్గం పైకప్పు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఆయన ఉదయం 9.38 గంటలకు టెంపుల్‌సిటీలో వేదపాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సమక్షంలో భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు, ఈవో జి.భవానీశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయంలో స్వామివారి దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆలయాన్ని ఉదయం 3.30కు తెరవడానికి బదులుగా అరగంట ముందుకు జరిపి 3గంటలకే తెరవనున్నారు. 5.15 గంటలకు జరిగే స్వామివారి నిజాభిషేకాన్ని 5 గంటలకే నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా టెంపుల్‌సిటీతోపాటు సీఎం కాన్వాయ్ మార్గంలో భారీగా సాయుధ పోలీసు బలగాలను మోహరించనున్నారు.