Share News

తెలంగాణ.. అభివృద్ధికి నమూనా

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:54 AM

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ.. అభివృద్ధికి నమూనా

  • పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం

  • గత ప్రభుత్వంలోని మంచిని ప్రోత్సహిస్తాం

  • మరింత మెరుగుపరిచి అమలు చేస్తున్నాం

  • ఫ్యూచర్‌ సిటీలో భారీగా పెట్టుబడులు

  • ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి

  • 2034 నాటికి అమెజాన్‌ సంస్థ

  • రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలి

  • పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే అమరరాజా లాంటి పరిశ్రమలు అవసరం

  • విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం

  • మేం వచ్చాక అధిక ప్రాధాన్యం: సీఎం రేవంత్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఏమవుతారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే.. మీ రేవంతన్నను చూపించండి. నేనూ ప్రభుత్వ పాఠశాలలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా.

- కొత్తకోటలో పాఠశాల విద్యార్థులతో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌/రంగారెడ్డి అర్బన్‌/మహబూబ్‌నగర్‌/వనపర్తి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకే తెలంగాణ రైజింగ్‌ పాలసీని రూపొందించుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతోపాటు, దేశ జీడీపీలో రాష్ట్రం వాటాను 10 శాతానికి పెంచే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలోని మంచిని ప్రోత్సహిస్తున్నామని, దానిని మరింత మెరుగుపరిచి ముందుకు తీసుకెళుతున్నామని వివరించారు. తమ ప్రభుత్వానికి విధాన స్తబ్ధత (పాలసీ పెరాలసిస్‌) లేదని స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట, బేగరికంచలో నిర్మితమవుతున్న భారత్‌ ప్యూచర్‌ సిటీలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్లుఎస్‌) డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ (సీక్యూపీ)ను, వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాలను ప్రారంభించారు.


ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టానికి వచ్చే పరిశ్రమలకు సింగిల్‌ విండో విధానం, పారదర్శక అనుమతుల వ్యవస్థ, వేగవంతమైన భూ కేటాయింపులతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఫార్చ్యూన్‌ -500 సంస్థల పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2034 నాటికి అమెజాన్‌ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రతినిధులను కోరారు.


ఈవీలకు ప్రోత్సాహకం..

రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక, ఇంధన, క్రీడలు, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు సమగ్ర విధానాలను తమ ప్రభుత్వం రూపొందించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నాణ్యమైన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో ఓఆర్‌ఆర్‌, విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కూడా ఎన్నో అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కానీ, నేడు అవి హైదరాబాద్‌ ముఖచిత్రాన్నే మార్చేశాయని, అభివృద్ధికి నమూనాగా నిలిచాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యరహిత, సుస్థిర మహానగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామని, ఫార్మా పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దాంతోపాటు హైదరాబాద్‌లోని 3వేల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. నగరంలో డీజిల్‌పై ఆధారపడి నడుస్తున్న 2లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్‌ ద్వారా ఈవీలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం రూ.1500 కోట్లు నష్టపోయినా కూడా ఈవీ వాహనాలకు జీరో ట్యాక్స్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమెజాన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో తెలంగాణలో డేటా సెంటర్‌ ఎకోసిస్టమ్‌ మరింత బలోపేతమవుతుందని, దీనివల్ల ఐటీ, సాఫ్ట్‌వేర్‌ అనుబంధ పరిశ్రమలు పెద్దఎత్తున రాష్ర్టానికి వచ్చే అవకాశముందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇస్తున్న స్థానిక రైతులను సీఎం అభినందించారు. ఏవైనా సమస్యలుంటే రైతులతో సామరస్యంగా మాట్లాడి, మంచి పరిహారం కల్పించి గౌరవించాలని మంత్రి శ్రీధర్‌బాబుకు, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి సీఎం సూచించారు.


ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్‌ లేదు..

పారదర్శక పాలన ఉండి.. మౌలిక వసతులు కల్పిస్తే పారిశ్రామికంగా తెలంగాణ అన్‌స్టాపబుల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో బుధవారం కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. 1983లో అమరరాజా చిత్తూరులో మొదటి సంస్థను ఏర్పాటు చేసిందని, 40 ఏళ్ల నుంచి వేల మందికి ఉపాధి కల్పిస్తూ చైనా, జపాన్‌, జర్మనీ, కొరియా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తోందని తెలిపారు. అందుకే అది గ్లోకల్‌ సంస్థ (గ్లోబల్‌ రీచ్‌- లోకల్‌ ఎంప్లాయింట్‌)గా మారిందని అన్నారు. ప్రపంచంలో ఈవీ వాహనాలకు లీడర్‌గా ఉన్న చైనాతో అమరరాజా పోటీపడుతోందన్నారు. కాలుష్యం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించే అమరరాజా లాంటి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు త్వరలో శుభవార్త వింటారని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటివాటా సాధించే దిశగా పక్క రాష్ట్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. దీంతోపాటు డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల కేటాయింపులపై కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 2023 డిసెంబరు నాటికి తెలంగాణలో పరిశ్రమల వాటా 6.88 శాతంగా ఉందని, ఈ రెండేళ్లలో అది 8.1 శాతానికి పెరిగిందని అన్నారు. 2034 వరకు 13 శాతానికి పెంచడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. పరిశ్రమల్లో ప్రగతి లేదనే వారికి ఇదే సమాధానమని, రాష్ట్ర ఖజానాకు పరిశ్రమలు రూ.3 లక్షల కోట్లు అందిస్తున్నాయని చెప్పారు.

Updated Date - Jul 16 , 2026 | 06:51 AM