Share News

రేవంత్‌కు నిరాకరణ తెలంగాణకు అన్యాయమే

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:11 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు.

రేవంత్‌కు నిరాకరణ తెలంగాణకు అన్యాయమే

  • రాష్ట్రాలకొచ్చే పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది

  • తమద్వారానే రావాలనుకుంటోంది

  • విదేశీ పర్యటనల కోసం తమకు నచ్చిన వాళ్లకే అనుమతులిస్తోంది: ఖర్గే

కలబురగి, ఆగస్టు 22: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నచ్చిన వాళ్లకు అనుమతులు ఇస్తూ నచ్చని వాళ్లకు నిరాకరిస్తోందని మండిపడ్డారు. రేవంత్‌కు అనుమతి నిరాకరణ రాష్ట్రానికి అన్యాయం చేయడమేనన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రేవంత్‌ పెట్టుకున్న పర్యటనను అడ్డుకోవడం రాష్ట్రాలకు పెట్టుబడులను అడ్డుకోవడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. శనివారం కలబురగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేతల విదేశీ పర్యటనల అనుమతుల విషయంలో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, తాము కోరుకున్న వారికే అనుమతులు ఇస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రులు అమెరికా, బ్రిటన్‌లలోని భారతీయులను కలవడంతో పాటు అక్కడి నుంచి సొంత రాష్ట్రానికి పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి వెళతారని చెప్పారు. తెలంగాణ, ఏపీల నుంచి పెద్దఎత్తున ప్రవాసులు అమెరికాలో ఉన్నారని, సొంత రాష్ట్రాల్లో వారు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అన్నారు. వారు సొంత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా రాష్ట్ర నాయకత్వాన్నే కలుస్తారని చెప్పారు. ఇలాంటి సమావేశాలు రాష్ట్రాలకు పెట్టుబడులు తేవడమే కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌కు అనుమతి నిరాకరిచిందని ఖర్గే ఆరోపించారు. ముఖ్యమంత్రి వెళితే పెట్టుబడులు వస్తాయని, కేంద్రం తన ద్వారానే పెట్టుబడులు రావాలని భావిస్తోందని, ఇది సరి కాదని ఖర్గే వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 23 , 2026 | 06:12 AM