రేవంత్ అమెరికా పర్యటనకు ఇంకా లభించని కేంద్ర అనుమతి!
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:43 AM
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. అమెరికాలో ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం అర్ధరాత్రి వరకు కూడా అనుమతులు రాకపోవడమే కారణం.
లండన్ చేరుకున్న సీఎం
23న అమెరికాలోని బోస్టన్‌కు..
29 దాకా పర్యటనకు ప్రణాళిక
శుక్రవారం అనుమతులు రావొచ్చంటున్న అధికార వర్గాలు
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. అమెరికాలో ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం అర్ధరాత్రి వరకు కూడా అనుమతులు రాకపోవడమే కారణం. అయితే శుక్రవారం కేంద్ర అనుమతి వచ్చే అవకాశం ఉందని, రేవంత్ అమెరికా పర్యటన యథాతథంగా కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సహజంగా దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం విదేశాలకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం (ప్రధాని, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖల) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా అవాంఛనీయ, ప్రత్యేక పరిస్థితులు నెలకొంటే తప్ప.. సీఎం కార్యాలయం కోరగానే కేంద్రం నుంచి అనుమతులు మంజూరు అవుతాయి. ఈ క్రమంలో ఈనెల 20 నుంచి 29వ తేదీ వరకు బ్రిటన్, అమెరికా దేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కోసం కేంద్రం అనుమతి కోరుతూ తెలంగాణ సీఎంవో లేఖ రాసింది. అందులో బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి లభించింది. దీంతో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ లండన్‌కు వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఆయనకు వీడ్కోలు పలికారు. అయితే షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం(23న) లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు సీఎం వెళ్లాల్సి ఉంది. కానీ గురువారం అర్ధరాత్రి వరకూ కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ఒకవేళ అనుమతులు రాకుంటే.. సీఎం రేవంత్ లండన్ పర్యటన ముగియగానే హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంటుంది. వచ్చే మూడురోజుల్లో శుక్రవారం ఒక్కటే పని దినం ఉందని.. కేంద్రం అనుమతి ఇవ్వాలనుకుంటే.. శుక్రవారంవచ్చే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కేంద్రం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతివ్వని పక్షంలో.. స్వయంగా ప్రధానమంత్రే నిలిపేసినట్టు అ వుతుందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.