ట్రంప్‌తో భేటీకి ట్రై చేశారా?
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:26 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
కనీసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కలిపిద్దామనుకున్నారా?.. ఆ దిశగా యత్నాలు జరిగాయా?
ఆ సంకేతాలతోనే సీఎం పర్యటనపై కేంద్రం కఠిన నిర్ణయం!
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. రేవంత్ రాజకీయంగా బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నా అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో భేషజాలకు పోకుండా కేంద్రంతో కలిసి నడిచేందుకే మొగ్గు చూపుతారు. పర్యటన ప్రోగ్రాం ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు లేనందుకే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని విదేశాంగ శాఖ పైకి చెబుతున్నా ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం వేరే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చాలని పట్లుదలతో ఉన్న ముఖ్యమంత్రి అందుకు కీలకమైన అమెరికా ప్రభుత్వంలో ముఖ్యులను కలిసే అవకాశాలను అన్వేషించారని భావిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ట్రంప్ ఎవెన్యూ అని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు పేరు పెట్టిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సానుకూల వాతావరణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కానీ కనీసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశానికి అమెరికాలో కొన్ని వర్గాల ద్వారా ప్రయత్నాలు జరిగినట్లు భారత నిఘా వర్గాలకు సంకేతాలు అందాయని, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు రేవంత్ షెడ్యూల్ ప్రతిపాదనల్లో లేకపోవడం వల్ల కేంద్రం ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెట్టుబడులు, ఒప్పందాల కోసం అమెరికా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ఎలాంటి కొర్రీ లేకుండా అనుమతి ఇచ్చిన విదేశాంగ శాఖ అందులో భాగమైన ఒక్క రేవంత్‌కు మాత్రమే అనుమతి నిరాకరించడం గమనార్హం. గతంలో రెండుసార్లు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతించింది. ఈ ఏడాది జనవరిలోనే హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో కోర్సు చేయడానికి వెళ్లారు. ‘‘ట్రంప్, వాన్స్‌తో భేటీ ప్రొటోకాల్‌తో ముడిపడిన అంశం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన సందర్భంగా భేటీ అయ్యే నేతల హోదా కూడా పొలిటికల్ క్లియరెన్స్‌లో కీలకమే’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ‘‘సీఎం రేవంత్ అమెరికాలో ఎవరితో భేటీ అవుతారు? ఆయన పర్యటన ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? వంటి వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళుతుంటే ఆయన్ను ఆహ్వానించిన సంస్థల నేపథ్యం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించాయి.