Share News

అనుమతి నిరాకరణ కొత్తేమీ కాదు

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:15 AM

ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల అధికారిక విదేశీ పర్యటనల విషయంలో అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని..

అనుమతి నిరాకరణ కొత్తేమీ కాదు

  • విదేశీ పరిస్థితులకు అనుగుణంగానే ప్రముఖుల పర్యటనలపై నిర్ణయం

  • రేవంత్‌ టూర్‌కు నిరాకరణపై కిషన్‌రెడ్డి

  • కొండా సురేఖ చేరికపై పార్టీలో చర్చించాకే నిర్ణయమని వెల్లడి

  • సీఎం రేవంత్‌కు మమ్దానీని కలవాల్సిన అవసరమేంటి ?: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల అధికారిక విదేశీ పర్యటనల విషయంలో అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి చెప్పారు. నేతల పర్యటనకు అనుమతి ఇవ్వడమనేది దౌత్య నిబంధనలు, అంతర్జాతీయ భద్రత తదితర అంశాలతో ముడిపడి ఉంటుందని, ఇందులో రాజకీయ కక్ష సాధింపులు ఉండవని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించడంపై కిషన్‌రెడ్డి ఈ మేరకు స్పందించారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి నిరాకరించడం ఇది కొత్తేం కాదని, యూపీఏ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పటికీ అమలులో ఉన్నాయని వివరించారు. తనకు కూడా నాలుగైదు సార్లు అనుమతి లభించలేదని, కెనడా, రష్యాల్లో మైనింగ్‌కు సంబంధించి జరిగిన సదస్సులకు హాజరు కాలేకపోయానని కిషన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయలేకపోతున్న సీఎం రేవంత్‌ విదేశాల నుంచి కొత్త ఇంజనీరింగ్‌ కళాశాలలు తీసుకువస్తానని అనడం విడ్డూరంగా ఉందని కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. 22ఏ పేరిట నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.


కాగా, సొంతూరిలో ఓటరు జాబితాలో పేరు లేకపోతే సంక్షేమ పథకాలు ఉండబోవంటూ సీఎం రేవంత్‌ చేసిన బెదిరింపు ప్రకటనల వల్ల హైదరాబాద్‌ ప్రజలు చాలా మంది తమ సొంతూరిలో ఓటరుగా నమోదు చేసుకున్నారని ఆరోపించారు. ఎంఐఎం మెప్పు కోసం సీఎం చేసిన ఆ ప్రకటన వల్ల తన సికింద్రాబాద్‌ పార్లమెంటు పరిధిలో 9.30లక్షల ఓట్లు తగ్గాయని కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీలో చర్చించాకే మంత్రి కొండా సురేఖ చేరికపై నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి అన్నారు. కొండా సురేఖ బీజేపీలో చేరబోతున్నారు ‘అట’ .. అంటూ మీడియా ప్రస్తావించగా, ‘అట’లకు తాను జవాబు చెప్పనని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. కొండా సురేఖ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని ప్రకటించిన తర్వాతే స్పందిస్తానని చెప్పారు.


అనుమతి నిరాకరణ సరైనదే : రాంచందర్‌రావు

భారత్‌ పట్ల వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్న న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీని కలవాల్సిన అవసరం సీఎం రేవంత్‌ రెడ్డికి ఏమొచ్చిందో ప్రజలకు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. రేవంత్‌ అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించడం సరైన చర్యే అని స్పష్టం చేశారు. భారత వ్యతిరేక శక్తుల ప్రతినిధులను, రాహుల్‌ గాంధీకి సైద్ధాంతిక గురువులుగా ఉన్న వ్యక్తులను కలిసేందుకే రేవంత్‌ అమెరికా పర్యటన తలపెట్టారనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోందని పేర్కొంటూ ఓ ప్రకటన చేశారు. ప్రతిపాదిత అమెరికా పర్యటనలో జొహ్రాన్‌ మమ్దానీతో భేటీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆ వివరాలను అధికారిక షెడ్యూల్‌లో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఇటీవల న్యూయార్క్‌లో నిర్వహించిన పాకిస్థాన్‌ డే వేడుకల్లోనూ, అయోధ్య రామమందిర భూమిపూజను వ్యతిరేకిస్తూ 2020లో టైమ్స్‌ స్క్వేర్‌లో జరిగిన నిరసనలో మమ్దానీ పాల్గొన్నారని రాంచందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యమైతే, మమ్దానీతో భేటీ వల్ల కలిగే ప్రయోజనమేంటని నిలదీశారు.

Updated Date - Aug 23 , 2026 | 06:17 AM