Share News

అమెరికాకు నో!

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:22 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఆయన బ్రిటన్‌ పర్యటనకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు మాత్రం ఇవ్వడానికి నిరాకరించింది.

అమెరికాకు నో!

  • రేవంత్‌ పర్యటనకు పొలిటికల్‌ క్లియరెన్స్‌ ఇవ్వని కేంద్రం

  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం రేవంత్‌ విస్మయం

  • కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తూ పర్యటన రద్దు

  • 23న అమెరికాకు బదులు హైదరాబాద్‌కు రేవంత్‌

  • వర్సిటీలతో ఒప్పందాల బాధ్యత అధికారులకు

  • అమెరికాలో కార్యక్రమాలు సీఎం స్థాయికి తగవు

  • అందుకే రాజకీయ అనుమతికి నిరాకరించాం

  • విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ

  • బ్రిటన్‌, అమెరికా పర్యటనల ఉద్దేశం ఒకటే అయినా అనుమతి నిరాకరణపై ప్రభుత్వ వర్గాల్లో విస్మయం

హైదరాబాద్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఆయన బ్రిటన్‌ పర్యటనకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు మాత్రం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 21 నుంచి 29 వరకు రేవంత్‌రెడ్డి బ్రిటన్‌, అమెరికా దేశాల్లో అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందాల కోసం పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. తొలుత రేవంత్‌రెడ్డి బ్రిటన్‌ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలకు కేంద్ర ప్రభుత్వం తేలికగానే అనుమతులు మంజూరు చేస్తూ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే భావనతో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి లండన్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లి పోయారు.


ఇంతలో కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు పొలిటికల్‌ క్లియరెన్స్‌ను నిరాకరించింది. బ్రిటన్‌ పర్యటనకు అనుమతినిచ్చి అమెరికా పర్యటనకు నిరాకరించడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఈ నెల 23న లండన్‌ నుంచి బోస్టన్‌కు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం అమెరికా పర్యటనకు అనుమతిని నిరాకరించడం పైన కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ శుక్రవారం ఢిల్లీలో వివరణ ఇచ్చారు. రేవంత్‌ బ్రిటన్‌ పర్యటనకు అనుమతిని ఇచ్చామని వెల్లడించిన ఆయన.. అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. ‘‘ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు పొలిటికల్‌ క్లియరెన్స్‌ ఇచ్చే ముందు కేంద్ర విదేశాంగ శాఖ ఆయా పర్యటనలను పరిశీలిస్తుంది. ప్రతిపాదిత కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగిన విధంగా ఉండాలి. అమెరికా పర్యటన కార్యక్రమం ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేదని భావించాం. అందుకే పొలిటికల్‌ క్లియరెన్స్‌ నిరాకరించాం’’ అని వివరించారు.


సీఎం విస్మయం

విధి విధానాలు, ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి యూకే, అమెరికా పర్యటనలకు అనుమతిని ఇవ్వాల్సిందిగా తెలంగాణ సీఎంఓ కేంద్ర ప్రభుత్వాన్ని ముందే కోరింది. కేంద్ర ప్రభుత్వం తొలుత యూకే పర్యటనకు అనుమతిని ఇచ్చింది. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు సర్వ సాధారణంగా అనుమతులు వచ్చే ఆనవాయితీ ఉండటం, అప్పటికే లండన్‌ పర్యటనకు కేంద్రం అనుమతులు ఇచ్చేయడంతో షెడ్యూల్‌ను ప్రకటించేసి తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందంతో సీఎం లండన్‌కు వెళ్లి పోయారు. బృందం యూకేకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం తెలియజేసింది. తెలంగాణ అభివృద్థి, విద్యా రంగ పురోగతికి.. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి తోడ్పడే ఈ పర్యటనకు పొలిటికల్‌ క్లియరెన్స్‌ నిరాకరించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై లండన్‌లో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ‘‘ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయాలు, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి.


దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను’’ అన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అమెరికా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను అధికారుల బృందం కొనసాగించాలని, ఆయా విశ్వవిద్యాలయాలతో అవసరమైన అన్ని అవగాహన, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ‘‘హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఉస్మానియా, హెచ్‌సీయూ, జేఎన్‌టీయూలు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చాయి. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రపంచంలోని గొప్ప టెక్‌ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారు. ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్‌ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్‌ అగ్రశ్రేణి కార్పొరేషన్లు, వాటి గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగింది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చి, 21వ శతాబ్దపు మన ప్రగతి ప్రయాణానికి శక్తినిస్తాం’’ అని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం, ప్రయత్నం. ఒక సాధారణ భారతీయుడు హైదరాబాద్‌లోనే హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఎంఐటీ, ఎల్‌బీఎస్‌, ఎల్‌ఎస్ఈ వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి విద్య, సర్టిఫికేషన్‌ పొందగలగాలి. ఎందుకంటే చాలామంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు. కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను భారత్‌కు తీసుకురావాలని అభిలషిస్తున్నాను’’ అని అన్నారు.


అక్బర్‌ కూతురు పెళ్లికి వెళ్తున్న విషయం ఎందుకు చెప్పలేదు?: అర్వింద్‌

సీఎం యుఎస్‌ పర్యటనకు అనుమతి నిరాకరరణ సీరియస్‌ అంశమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. క్లియరెన్సు ఎందుకు రాలేదన్నది పెద్ద ప్రశ్న అని వ్యాఖ్యానించారు. అక్బరుద్దీన్‌ కూతురి పెళ్లికి వెళుతున్నట్లు సీఎం తన లండన్‌ పర్యటన షెడ్యూల్‌లో ఎందుకువెల్లడించలేదని ప్రశ్నించారు.

రెండు దేశాల్లో పర్యటన ఉద్దేశం ఒకటే!

రేవంత్‌ బృందం బ్రిటన్‌, అమెరికా దేశాల్లో పెట్టుకున్న పర్యటన ఉద్దేశం ఒకటిగానే ఉంది. రేవంత్‌ యూకే పర్యటనలో భాగంగా శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిధిలోని బ్లావత్‌నిక్‌ స్కూల్‌ను, ఎమిరేట్స్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంను సందర్శించారు. ప్రొఫెసర్లతో సమావేశం అయ్యారు. మాజీ సీఎస్‌ రామకృష్ణారావు ఆయన వెంట ఉన్నారు. సీఎం శనివారం కేంబ్రిడ్జ్‌ వర్శిటీ టీమ్‌తో ఇంటరాక్ట్‌ కానున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, లండన్‌ యూనివర్శిటీ క్యాంప్‌సను సందర్శిస్తారు. అమెరికా పర్యటనలోనూ షెడ్యూల్‌ ప్రకారం హార్వర్డ్‌ యూనివర్శిటీ క్యాంప్‌సను, ఎంఐటీ క్యాంప్‌సను, నార్త్‌ ఈస్ట్రన్‌ క్యాంప్‌సను సందర్శించాల్సి ఉంది. వర్జీనియా టెక్‌ వర్శిటీ టీమ్‌తో భేటీ కావాల్సి ఉంది.

సీఎం విదేశీ పర్యటనపై బీజేపీ చిల్లర రాజకీయం: ఆది శ్రీనివాస్‌

సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనపై తెలంగాణ బీజేపీ నాయకులు అనవసర రగడ సృష్టిస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారని ఎంపీ ధర్మపురి అరవింద్‌ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే సీఎం అధికారిక పర్యటన జరుగుతుందనే కనీస జ్ఞానం ఆయనకు లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కిల్‌ యూనివర్సిటీ, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తెస్తుంటే.. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేత లు విద్యార్థులను పక్కదారి పట్టిస్తూ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 05:24 AM