ప్రత్యామ్నాయ పంటలకు రైతుల్ని సిద్ధం చేద్దాం: రేవంత్
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:38 AM
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా, అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా చర్చించారు.
పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలను ప్రోత్సహిద్దాం
ప్రభుత్వమే సేకరిస్తుందన్న భరోసా కల్పిద్దాం.. మంత్రివర్గ భేటీలో సీఎం
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా, అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా చర్చించారు. రైతులు వరి నార్లు బతికించుకోవడానికి కొన్ని చోట్ల ఎకరానికి రూ.50 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారని, వరుణుడు కరుణించని పక్షంలో ఆ మొత్తం వృధా అయ్యే పరిస్థితి కనిపిస్తోందని పలువురు మంత్రులు సమావేశం దృష్టికి తెచ్చారు. దీంతో రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం వచ్చింది. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలకు సమాయత్తం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సమావేశాల ద్వారా, వీడియోల రూపంలో రైతుల్ని చైతన్య పరచాలని సూచించారు. వాస్తవానికి తెలంగాణ నేల.. వైవిధ్యభరితమైన పంటలకు నిలయమని, వరి, పత్తి విస్తీర్ణం పెరిగాకే పరిస్థితి మారిందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ముఖ్యంగా ఈ రెండు పంటలను మద్దతు ధరకు సివిల్ సప్లయ్స్, సీసీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించడం ప్రారంభించాకే ధర గ్యారెంటీ దొరికి.. వాటి విస్తీర్ణమూ పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలనూ ప్రభుత్వం సేకరిస్తుందన్న భరోసా రైతుల్లో కల్పించాలని మంత్రులకు సీఎం సూచించారు. నూనెగింజల పంటల సేకరణకు కేంద్ర ప్రభుత్వమూ సానుకూలంగా ఉందన్నారు. రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలకు సమాయత్తం చేయండం ఇబ్బందే అయినా.. వారు నష్టపోకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత అని అన్నట్లు సమాచారం.