Share News

CM Revanth Reddy Urges: కష్ట పడండి.. కలసి ఉండండి!

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:49 AM

ఎస్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉండొద్దని, కలిసికట్టుగా ఉంటూ కష్ట పడాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసీ, లంబాడా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

CM Revanth Reddy Urges: కష్ట పడండి.. కలసి ఉండండి!

  • లంబాడా, ఆదివాసీల మద్దతు నిలుపుకుందాం

  • ఇక అందరితో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ సమన్వయం

  • ఎస్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశనం

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఎస్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉండొద్దని, కలిసికట్టుగా ఉంటూ కష్ట పడాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసీ, లంబాడా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. టీపీసీసీ ఎస్టీ సెల్‌ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌.. ఈ నెల 8న గాంధీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని సోమవారం అసెంబ్లీలో ఆయన చాంబర్‌లో కలిసి కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆదివాసీలు, లంబాడాలు మద్దతుగా నిలిచారని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ వారి మద్దతు కొనసాగేందుకు కృషి చేయాలని ఎస్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక నుంచి లంబాడా, ఆదివాసీ ఎమ్మెల్యేలు, నేతలను శంకర్‌నాయక్‌ సమన్వయం చేసుకుంటారని చెప్పారు. ఘనంగా సేవాలాల్‌ జయంతి జరుపుకుందామని సీఎం రేవంత్‌ చెప్పారు. ఎస్టీలు భారీగా దర్శించుకునే మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధిపైనా వారితో చర్చించారు. తొలిసారి గెలుపు తేలికేనని, మలి విడత విజయం సవాళ్లతో కూడుకుని ఉంటుందని, కనుక ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్లలో జాగ్రత్తగా పని చేసుకోవాలని హితవు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు ఎడ్మ బొజ్జు, రాంచంద్ర నాయక్‌, బాలూ నాయక్‌, జారె ఆదినారాయణ ఉన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 01:49 AM