Share News

మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌తో కలిపే..యువతరం బిల్లు

ABN , Publish Date - Jul 27 , 2026 | 05:42 AM

దేశంలో అసెంబ్లీలు, లోక్‌సభకు పోటీచేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని.. ప్రస్తుత మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులోనే ఈ అంశాన్నీ చేర్చాలని..

మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌తో కలిపే..యువతరం బిల్లు

  • చట్టసభలకు పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించే అంశాన్నీ చేర్చండి

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన

  • ఇప్పుడు 21 ఏళ్ల యువత ఐఏఎ్‌స, ఐపీఎ్‌సలు

  • అవుతున్నారు.. కంపెనీలనూ నడిపిస్తున్నారు

  • దేశ భవితనూ నిర్ణయించాలనుకుంటున్నారు

  • చట్టసభలకు పోటీ వయసును 21 ఏళ్లకు

  • తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం

  • కేవలం నినాదాలతో దేశం అభివృద్ధి చెందదు

  • ప్రతిపక్షాలు, ప్రజల మాటను వినాలి

  • అలా చేయకనే 56 అంగుళాల ఛాతీ

  • యువత ముందు తలవంచాల్సి వచ్చింది

  • జాతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో అసెంబ్లీలు, లోక్‌సభకు పోటీచేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని.. ప్రస్తుత మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులోనే ఈ అంశాన్నీ చేర్చాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఇప్పుడు 21 ఏళ్ల యువత ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు అవుతున్నారని, పెద్ద కంపెనీలనూ నడుపుతున్నారని గుర్తు చేశారు. వారికి రాజకీయాల్లో ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌, నియోజకవర్గాల పెంపు, పునర్విభజన, పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించడం.. ఈ నాలుగు అంశాలనూ ఒకే బిల్లులో చేర్చి పార్లమెంటులో సమగ్ర చర్చ చేపట్టాలని ప్రధాని మోదీని కోరారు. లేదా సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, ఈ అంశాలపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని.. నిపుణులు, సంబంధిత వర్గాలతోనూ చర్చించాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలోని యువశక్తి ముందు 56 అంగుళాల ఛాతీ కూడా తలవంచాల్సి వచ్చిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్లచట్టాలను ప్రతిపక్షాలు తప్పుబట్టినా మోదీ వినలేదని.. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా రైతులకు క్షమాపణలు కూడా చెప్పాల్సి వస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ చెప్పారని గుర్తు చేశారు. తర్వాత రైతుల పోరాటంతో మోదీ సర్కారు సాగు చట్టాలను వెనక్కి తీసుకుని, రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాతైనా ప్రతిపక్షాలకు మోదీ కొంత గౌరవం ఇస్తారని, పార్లమెంట్‌లో చర్చకు అవకాశం కల్పిస్తారని భావించామని.. కానీ వారి వైఖరి మారలేదని చెప్పారు. అనేక ప్రవేశ, నియామక పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని.. ప్రతిపక్షాల సూచనలు, హెచ్చరికలను పట్టించుకోలేదని మండిపడ్డారు. పైగా ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, ఒత్తిడి తేవడం కొనసాగించిందని మండిపడ్డారు. ఇప్పుడు దేశ యువత గల్లీ నుంచి పార్లమెంటు వరకు బలాన్ని చూపడంతో 56 అంగుళాల ఛాతీ నిలబడలేక పోయిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు, మిత్రపక్షాల సూచనలు పట్టించుకోకుంటే యువత వీధుల్లోకి వచ్చేస్తుందని, ప్రభుత్వానికి ప్రజలు ఎదురుతిరుగుతారని మోదీ సర్కారుకు ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నారు. కేవలం వికసిత్‌ భారత్‌, సబ్‌కా సాథ్‌- సబ్‌కా వికాస్‌ వంటి నినాదాలతోనే దేశ అభివృద్ధి జరగదని.. యువశక్తిని సరైన దిశలో నడిపించి, దేశ భవిష్యత్తును నిర్మించాలని స్పష్టం చేశారు.


మార్పు రావాలి..

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి 25 ఏళ్లు, శాసనమండలి, రాజ్యసభకు 30 ఏళ్లను కనీస వయసుగా నిర్ణయించారని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని.. అందరికీ విద్య అందుబాటులోకి వచ్చిందని, ప్రజల్లో అవగాహనా శక్తి పెరిగిందని చెప్పారు. మన యువత ప్రతి నిమిషం కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రపంచాన్ని గమనిస్తోందని, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు 21 ఏళ్ల వయసున్న యువత ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు అవుతున్నారు. యూనికార్న్‌ కంపెనీలు స్థాపిస్తున్నారు. ఫార్చ్యూన్‌-500 కంపెనీలకు సీఈఓలుగా బాధ్యతలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభ, జ్ఞానం, సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. అలాంటి యువతకు రాజకీయాల్లో నాయకత్వం వహించే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? కాలానుగుణంగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు రోడ్లపై పోరాటం చేసిన యువత.. ఇకపై పార్లమెంట్‌లోకి వచ్చి దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాదొక సూచన. ఈ అంశంపై లోతుగా ఆలోచించండి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టం చేయండి’’ అని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌ కోరారు. యువతను రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తే.. దేశ భవిష్యత్తు మారుతుందని, ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్‌ ఎదుగుతుందని చెప్పారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన సమయం వచ్చిందని తాను భావిస్తున్నానన్నారు.


అసెంబ్లీలో చర్చించి.. తీర్మానం చేస్తాం

లోక్‌సభ, శాసనసభలకు పోటీచేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించే అంశంపైన సమగ్రంగా చర్చించేందుకు ఆగస్టులో రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలను ఏర్పాటు చేస్తామని రేవంత్‌ చెప్పారు. ప్రతిపక్షాల అభిప్రాయం కూడా తీసుకుంటామని తెలిపారు. పోటీ కనీస వయసును శాసనసభ, లోక్‌సభలకు 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభలకు 25 ఏళ్లకు తగ్గించాలని తీర్మానం చేస్తామని.. దేశానికి ఒక సందేశం ఇస్తామని వెల్లడించారు.

ప్రజల మాట వినాల్సిన సమయం వచ్చింది

బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే.. దేశాన్నే విమర్శిస్తున్నారంటూ, అర్బన్‌ నక్సల్స్‌, విదేశీ శక్తుల హస్తం ఉందంటూ ఆరోపణలు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. మన్‌ కీ బాత్‌ పేరుతో రేడియోలో మాట్లాడటం కాదు.. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రజల మాట వినాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ‘జై జవాన్‌- జై కిసాన్‌’ నినాదానికి ‘జై యువత’ను కూడా జోడించాల్సిన సమయం వచ్చిందన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 05:53 AM