Share News

‘మెట్రో’పై మరోసారి కిషన్‌రెడ్డికి లేఖ

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:42 AM

మెట్రో రైలు ప్రాజెక్టు విషయంపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించినా స్తబ్దత వీడకపోవడంతో.. స్పీడు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘మెట్రో’పై మరోసారి కిషన్‌రెడ్డికి లేఖ

  • ప్రాజెక్టుపై స్తబ్దత నెలకొనడంతో ప్రభుత్వం నిర్ణయం

  • మదింపు బృందంలో రాష్ట్ర ప్రతినిధిని ప్రకటించిన సర్కారు

  • ఇంకా ప్రకటించని కేంద్ర ప్రభుత్వం.. ఎస్‌బీఐ క్యాప్స్‌ స్పందన శూన్యం

  • స్పీడు పెంచాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు ప్రాజెక్టు విషయంపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించినా స్తబ్దత వీడకపోవడంతో.. స్పీడు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘రెండు వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎస్‌బీఐ క్యాప్స్‌ (క్యాపిటల్‌ మార్కెట్‌) నుంచి స్పందన లేదు. దీనిపై ఎలా ముందుకెళదాం? స్పీడు పెంచకపోతే ఈ అంశం మరింత ఆలస్యానికి గురవుతుంది. ఎలాగైనా వెంటపడాల్సిందే’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. అయితే అందుకు ముందుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరోసారి లేఖ రాద్దామని చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి.. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, అశ్వనీ వైష్ణవ్‌లతో సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మొదటి దశ వ్యయాన్ని మళ్లీ మదింపు చేసేందుకు, రెండో దశ వ్యయ అంచనాలను నిర్ధారించేందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌కు బాధ్యతలు అప్పగించారు. క్యాప్స్‌ బృందంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో అధికారిని ప్రతినిధులుగా చేర్చాలని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతినిధిగా మెట్రోపాలిటన్‌ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ను ప్రకటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తన ప్రతినిధిని ప్రకటించలేదు. పైగా.. ఎస్‌బీఐ క్యాప్స్‌ కూడా బృందాన్ని ఏర్పాటు చేయలేదు.


దీంతో ఈ అంశంపై స్తబ్దత నెలకొంది. ఇప్పటికే మొదటి దశ కోసం జపాన్‌ ఇచ్చిన రుణం రూ.13,600 కోట్లు ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎ్‌ఫసీ) వద్ద ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి దశ ప్రాజెక్టును అప్పగించడానికి ఎల్‌అండ్‌టీతో రూ.15 వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. ఇందులో రూ.13,600 కోట్లను రుణం రూపంలో తీసుకోవాలనుకున్న ప్రభుత్వం.. మిగతా రూ.1400 కోట్లను ఎల్‌అండ్‌టీకి చెల్లించింది. అయితే దీనిని తిరిగి మదింపు చేయాలన్న బాధ్యతలను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించినా.. ఇంకా ముందడుగు పడలేదు. దీనిపై స్పీడు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ప్రాజెక్టు వందేళ్లపాటు ఉండే ఆస్తి అని, దీనిని ఎలాగైనా పూర్తి చేయాలని అన్నారు. అయితే.. ముందుగా కిషన్‌రెడ్డికి మరోసారి లేఖ రాయాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ లేఖ రాస్తారని సమాచారం. ఆయన నుంచి వచ్చే స్పందనను బట్టి ముందుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.


త్వరలో తుమ్మిడిహెట్టికి సీఎం రేవంత్‌రెడ్డి..!

ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి నిర్మాణ ప్రదేశాన్ని సీఎం రేవంత్‌ త్వరలోనే పరిశీలించనున్నారు. 8 లేదా 9 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించే అవకాశం ఉందని సమాచారం. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంతో పాటు అలైన్‌మెంట్‌ను సీఎం పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో కట్టడానికి వీలుగా ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్‌) కూడా సిద్ధం అయ్యాకా... మహారాష్ట్ర సీఎం ఫడ్నవీ్‌సతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యి 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి తెలపాలని కోరే అవకాశం ఉంది. ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించినా, 150 మీటర్ల ఎత్తుతో నిర్మించినా 300ఎకరాల పరిధిలోనే ముంపు ఉంటుందని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాలు చెబుతున్నాయి. 149.50 మీటర్ల ఎత్తుతో కడితే 108.58 టీఎంసీలు, 150 మీటర్ల ఎత్తుతో కడితే 129.23 టీఎంసీలు తరలించవచ్చని ప్రభుత్వం గుర్తించగా, ఇప్పటికే 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర కూడా సమ్మతి తెలిపింది. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీపీఆర్‌ తయారీ, పీఎఫ్ఆర్‌ నివేదికలకు త్వరగా తుదిరూపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 04 , 2026 | 05:44 AM