Share News

సమాజ అభివృద్ధికి చేయి కలపండి

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:52 AM

సమాజాభివృద్ధి కోసం వెచ్చించే నిధులను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా భావించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌ ) నిధుల అంశంపై వివిధ కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు.

సమాజ అభివృద్ధికి చేయి కలపండి

  • ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి.. సహకరిస్తాం

  • సీఎస్ఆర్‌ నిధుల అంశంలో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సమాజాభివృద్ధి కోసం వెచ్చించే నిధులను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా భావించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌ ) నిధుల అంశంపై వివిధ కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. సీఎస్ఆర్‌ కింద కంపెనీలు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలని సీఎం రేవంత్‌ ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. కంపెనీలు వీటితోపాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకుని వాటికి సీఎస్ఆర్‌ నిధులను వినియోగించాలని కోరారు. ప్రభుత్వం, కంపెనీలు కలిపి చేసే వ్యయంతో రాష్ట్ర విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్ది భవిష్యత్‌ అవకాశాలను అందుకునేలా తయారుచేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యపై పెట్టే ఖర్చును తాము భవిష్యత్‌ తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్‌లోనే 44 శాతం మంది ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్నిరకాల మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్‌ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. సీఎస్ఆర్‌ నిధుల వినియోగంలో ఇప్పటివరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించామని, కంపెనీల ప్రతినిధులు ఆ ప్రత్యేక కార్యదర్శితో సమన్వయం చేసుకోవాలన్నారు.


కంపెనీలు తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జలవనరులు, నైపుణ్యశిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా ఏ విభాగానికైనా సీఎస్ఆర్‌ నిధులు వినియోగించవచ్చని సీఎం తెలిపారు. కంపెనీలకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కాగా, విద్యాభివృద్ధికి రహేజా గ్రూప్‌ రూ.50కోట్లు, రాంకీ గ్రూప్‌ రూ.50కోట్లు, యశోద ఫౌండేషన్‌ రూ.10కోట్ల చొప్పున కేటాయించేందుకు ముందుకువచ్చాయన్న సీఎం వారికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ.. సీఎస్ఆర్‌ నిధుల విషయంలో ఇప్పటివరకూ ఎవరూ ఇలా తమను సంప్రదించలేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. పాఠశాల విద్య, ఆస్పత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఈ సమావేశంలో రహేజా ఫౌండేషన్‌ తరపున శ్రావణ్‌కుమార్‌, రాంకీ నుంచి దాక్షాయణి ఆళ్ల, యశోద ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ గోరుకంటి సురేందర్‌రావు, గోరుకంటి ఫల్గుణ్‌రావు, మేఘా నుంచి సుధారెడ్డి, అపోలో తరఫున అపర్ణారెడ్డి, కామినేని భాస్కర్‌రెడ్డి, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నుంచి శేఖర్‌రెడ్డి, నాదం ఫౌండేషన్‌ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం

సీఎం రేవంత్‌ను కలిసిన టాటా లాక్‌హీడ్‌ సంస్థ ఎండీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నామని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఎయిరోస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (టీఎల్‌ఎంఏఎల్‌) ఎండీ టిమ్‌ రైఫిల్‌ ప్రకటించారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ కార్యాకలాపాల విస్తరణ, నూతన పెట్టుబడుల అంశంపై ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగాయి. భారీ సరుకు రవాణా విమానాలైన సీ130జే సూపర్‌ హెర్క్యులస్‌ ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ (ఎఫ్‌ఏఎల్‌) యూనిట్‌ను లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ భారత్‌లో ఏర్పాటుచేస్తోంది. అంతర్జాతీయ అవసరాల కోసం అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాల రెక్కలను ఉత్పత్తి చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎ్‌సఎల్‌)తో లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చింది.

సీఎంతో ఘనా హైకమిషనర్‌ భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): భారత్‌లోని రిపబ్లిక్‌ ఆఫ్‌ ఘనా హైకమిషనర్‌ క్వాసి ఒబిరిడాన్సో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఘనా - తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని హైకమిషనర్‌ ఆకాంక్షించారు. విద్య, శాస్త్ర, సాంకేతిక, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని కోరారు. ఈ అంశాలపై సీఎం రేవంత్‌ సానుకూలంగా స్పందించారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Apr 09 , 2026 | 05:53 AM