Share News

నేడు, రేపు పాలమూరులో సీఎం పర్యటన

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:11 AM

సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో ఆయన రెండు రోజుల పర్యటన ఖరారైంది. బెంగళూరు నుంచి గురువారం హైదరాబాద్‌ చేరుకోనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు పాలమూరు ....

నేడు, రేపు పాలమూరులో సీఎం పర్యటన

  • తొలి రోజు కొడంగల్‌ లిఫ్టు తదితర ప్రాజెక్టుల సందర్శన

  • కోయిల్‌సాగర్‌, జూరాల, ప్రతిపాదిత బ్యారేజీలపై ఏరియల్‌ వ్యూ

  • సోమశిల వద్ద పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష, అక్కడే రాత్రి బస

  • రెండో రోజు పూర్తిగా పీఆర్‌ఎల్‌ఐ పరిశీలన, ఉద్దండాపూర్‌లో సభ

మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో ఆయన రెండు రోజుల పర్యటన ఖరారైంది. బెంగళూరు నుంచి గురువారం హైదరాబాద్‌ చేరుకోనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు పాలమూరు పర్యటనకు బయల్దేరనున్నారు. మొదటి రోజు తన సొంత నియోజకవర్గానికి నీరందించే నారాయణపేట జిల్లాలోని మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. అనంతరం గద్వాల జిల్లాలోని గూడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. జూరాల విస్తరణ ప్రణాళికలను సమీక్షిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్యలో కోయిల్‌సాగర్‌, జూరాల, కృష్ణా, బీమా నదులపై తాజాగా ప్రతిపాదిస్తున్న బ్యారేజీల ప్రాంతాలను ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలకు చేరుకొని అక్కడే ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి రాత్రి బస చేస్తారు. రెండో రోజు ఉదయం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) హెడ్‌ రెగ్యులేటర్‌, పంప్‌హౌజ్‌, కాలువల పనులు, కల్వకుర్తి పంప్‌హౌజ్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఏరియల్‌ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. తర్వాత వట్టెం రిజర్వాయర్‌ను చేరుకొని అక్కడి పనులను సమీక్షించి మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలంలోని కరివెన రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. ఇక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం జడ్చర్ల మండలంలోని ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరుతారు. రెండు రోజులపాటు సీఎం పర్యటన అధికంగా హెలికాప్టర్‌ ద్వారానే సాగనుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 06:11 AM