నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:20 AM
రాష్ట్రంలో రైతు భరోసా రెండో విడత నిధులు సోమవారం విడుదల కానున్నాయి. నెల రోజుల క్రితం తొలి విడతగా రాష్ట్రంలోని రైతులందరికీ ఒక ఎకరం వరకు భూమికి సంబంధించిన సాయాన్ని ప్రభుత్వం..
బ్యారేజీ పరిశీలన.. అక్కడే అధికారులతో సమీక్ష
కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ
నస్తూర్‌పల్లి బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం
అక్కడ్నుంచే రైతుభరోసా 2వ విడత నిధుల విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతు భరోసా రెండో విడత నిధులు సోమవారం విడుదల కానున్నాయి. నెల రోజుల క్రితం తొలి విడతగా రాష్ట్రంలోని రైతులందరికీ ఒక ఎకరం వరకు భూమికి సంబంధించిన సాయాన్ని ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. సోమవారం రెండో ఎకరానికి సంబంధించిన చెల్లింపు జరగనుంది. ఉదాహరణకు ఒక రైతుకు 1 ఎకరం 20 గుంటల భూమి ఉంటే.. ఒక ఎకరానికి సంబంధించి గతంలోనే రూ.6 వేల సొమ్ము అందింది. మిగతా 20 గుంటల భూమికి ఇప్పుడు జమకానుంది. రెండెకరాల కన్నా ఎంత ఎక్కువ భూమి ఉన్నా.. సదరు రైతులకు అందులో రెండో ఎకరానికి సంబంధించిన రైతు భరోసా సోమవారం అందనుంది. అంటే ఎకరంలోపున్న రైతులకు తొలి విడతలోనే రైతు భరోసా పూర్తయింది. రెండు ఎకరాల వరకు భూమిఉన్న వారికి ఇప్పుడు చెల్లింపు పూర్తికానుంది. ఇదే తరహాలో విడతల వారీగా మిగతా భూములకూ నిధులు ఇవ్వనున్నారు. ఈ చెల్లింపునకు సంబంధించి పట్టాదారు పాస్‌బుక్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక రైతుకు రెండు చోట్ల భూమి ఉండి, రెండు పాస్‌బుక్‌లు ఉంటే.. రెండింటిలోనూ ఒక్కో ఎకరానికి ఇప్పటికే చెల్లింపు పూర్తయింది. ఇప్పుడు రెండో ఎకరానికి చెల్లింపు జరగనుంది. రాష్ట్రంలో మొత్తంగా 73 లక్షల పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్నాయి.
విడతల వారీగా నిధుల సమీకరణ
రైతుభరోసా అమలుకోసం ప్రతి సీజన్‌కు సుమారు రూ. 9 వేల కోట్ల చొప్పున ఏటా రూ.18 వేల కోట్లు కావాలి. ఏ సీజన్‌లో అయినా ఏకమొత్తంగా చెల్లించాలంటే నిధుల సర్దుబాటు చాలా కష్టం. ఈ క్రమంలోనే ప్రభుత్వం విడతల వారీగా నిధులు ఇస్తోంది. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా తొలి విడత రైతుభరోసాననను ప్రభుత్వం విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాల్లో రూ.3,447 కోట్లు నగదు జమ చేసింది. ఎకరంలోపే భూమి ఉన్న రైతులకు విస్తీర్ణానికి అనుగుణంగా సొమ్ము చెల్లించారు. ఇప్పుడు రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రూ.2,206 కోట్లను అందించనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటుచేసే ప్రజాపాలన సభలో సీఎం రేవంత్‌రెడ్డి రెండో విడత రైతుభరోసా విడుదల చేస్తారు. దీంతో రెండు విడతల్లో కలిపి రైతులకు అందే సొమ్ము రూ.5,653 కోట్లు అవుతోంది. ఇక మూడో విడత చెల్లింపులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే చెప్పారు. అయితే మూడో విడతలో మరో ఎకరానికి ఇస్తారా? ఐదెకరాల వరకు పూర్తిచేస్తారా? అనే స్పష్టత రావాల్సి ఉంది.
నస్తూర్‌పల్లిలో బహిరంగ సభ
భూపాలపల్లి/హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మహదేవపూర్ మండలంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయంలో రూ.200కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సరస్వతీ అంత్యపుష్కరాలకు విడుదల చేసిన రూ.21.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు జూన్‌లోగా పూర్తి చేసి, నవంబరు లేదా డిసెంబరులో పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాదిలో ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు బ్యారేజీని పరిశీలించనున్న సీఎం రేవంత్.. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడనున్నారు. అలాగే, కాటారం మండలంలోని నస్తూర్‌పల్లి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం హాజరవుతారు. ఇదే వేదికపై నుంచి రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం వెళ్లనున్న సీఎం.. రాత్రి 7.45 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.