Share News

మూడు జిల్లాల్లో నేడు సీఎం పర్యటన

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:28 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఒకేరోజు కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు.

మూడు జిల్లాల్లో నేడు సీఎం పర్యటన

  • ములుగు కలెక్టరేట్‌తో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం

  • రూ.16,007 కోట్లతో చేపట్టే హ్యమ్‌, పీఆర్‌ రోడ్లకు శంకుస్థాపన

  • పరకాలలో యంగ్‌ ఇండియా పాఠశాల, 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించనున్న రేవంత్‌

హైదరాబాద్‌/కామారెడ్డి/ములుగు/వరంగల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఒకేరోజు కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మొదటగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందులో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారానికి చేరుకుంటారు. వనదేవతలు సమ్మక్క- సారలమ్మ గద్దెలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత జిల్లా కేంద్రానికి చేరుకుని అక్కడ రూ. 63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు, ఆవరణలో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే ప్రాంగణంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లను పంపిణీ చేసి, ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటనున్నారు. దాంతోపాటు ములుగు జిల్లాలో రూ.868 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా హ్యమ్‌ పథకం కింద రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో 7,448 కిలోమీటర్ల మేర నిర్మించే 2,145 పంచాయతీరాజ్‌ రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. పర్యటన ఆఖరి విడతగా హనుమకొండ జిల్లా పరకాలకు సీఎం రేవంత్‌రెడ్డి చేరుకుని అక్కడ వివిధ శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఏర్పాట్లను పరిశీలించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 16 , 2026 | 06:29 AM