Share News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం నజర్‌

ABN , Publish Date - May 31 , 2026 | 05:23 AM

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. దీనికోసం జూన్‌ 4, 5వ తేదీల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం నజర్‌

  • 4, 5 తేదీల్లో క్షేత్రస్థాయి పర్యటన.. నిర్మాణ పనుల పురోగతిపై ఆరా

  • నార్లాపూర్‌లో అధికారులతో సమీక్ష.. సీఎం రాకతో పనుల్లో వేగం!

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. దీనికోసం జూన్‌ 4, 5వ తేదీల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ప్రాజెక్టుల పనులను పరిశీలించి, సమీక్ష చేయనున్నారు. జూన్‌ 4న బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి... కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలను ఏరియల్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసుకుంటూ కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారు. అనంతరం జూరాల ప్రాజెక్టు, గుడెందొడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా నార్లాపూర్‌ గ్రామానికి చేరుకుంటారు. అక్కడే ప్రాజెక్టులపై రాత్రి 7:30 గంటల నుంచి 9:30 గంటల దాకా సమీక్ష చేయనున్నారు. 5వ తేదీన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-1, 2,3లను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి నాగర్‌కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో నిర్మించిన ఇరిగేషన్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడో దశలో కుమ్మెర గ్రామంలో నిర్మిస్తున్న పంప్‌హౌ్‌సను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉద్ధండపూర్‌ రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష చేసి, విలేకర్లతో మాట్లాడనున్నారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ చిన్నారెడ్డి ఉండనున్నారు. వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుల పనులు నిరాశజనకంగా ఉన్నాయి. జిల్లాలో 8 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా... ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన/ప్రతిపాదించిన ప్రాజెక్టులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ఏళ్లకాలంలో కూడా ఏ ఒక్క ప్రాజెక్టూ పరిపూర్ణంగా పూర్తికాలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ల తవ్వకం అయినా.. వాటికి నీటిని తరలించే కాల్వలు పూర్తికాలేదు. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏదులకు నీటిని తరలించే కెనాల్‌ పనులు జరగడంలేదు.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొత్తం 5 మోటార్లున్నాయి. డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లు దెబ్బతినడంతో అందులో రెండు మోటార్లు ఐదేళ్ల నుంచి పనిచేయడం లేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ పనులకు ట్రాన్స్‌కోకు రూ.700 కోట్ల దాకా చెల్లింపులు చేయాల్సి ఉంది. జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని రేలంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సీపేజీతో నిండిపోయుంది. సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా ప్రాజెక్టుల పనుల తీరును సమీక్షించనుండడంతో నిర్మాణం వేగం పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - May 31 , 2026 | 05:23 AM