Share News

ప్రజా ప్రతినిధుల వాణి

ABN , Publish Date - May 10 , 2026 | 05:16 AM

ఇకనుంచి ప్రతి శనివారం ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా, ముఖాముఖి భేటీ కానున్నారు. వారి సమస్యలను పరిష్కరించనున్నారు.

ప్రజా ప్రతినిధుల వాణి

  • ఇక ప్రతి శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం భేటీ

  • వారి సమస్యల పరిష్కారానికి సంకల్పం

  • ప్రజా ప్రతినిధుల్లో అసంతృప్తిని గుర్తించి నిర్ణయం

  • తొలుత మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, సీతక్క,

  • వివేక్‌, సలహాదారులతో సమావేశమైన రేవంత్‌

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఇకనుంచి ప్రతి శనివారం ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా, ముఖాముఖి భేటీ కానున్నారు. వారి సమస్యలను పరిష్కరించనున్నారు. శనివారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో ప్రత్యేకంగా నిర్మించిన క్యాంప్‌ కార్యాలయంలో శనివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌, న్యూఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డితో విడివిడిగా సమావేశమయ్యారు. నిజానికి, మండల స్థాయిలో తహసీల్దార్‌ లేదా ఎంపీడీవో, డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో లేదా డివిజనల్‌ పంచాయతీ అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీల ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పలు సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. నిధులతోపాటు కీలక ప్రాజెక్టుల విషయంలో సీఎంకు నివేదిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు. కీలక పనులు చేపట్టాలంటే ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇవ్వాలి. దీనికంటే ముందు క్యాబినెట్‌ ఆమోదించాలి. కీలక సమస్యలు గట్టెక్కాలంటే సీఎంను కలిస్తేనే సాధ్యమవుతుంది. అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్‌ రెడ్డిని కలవడం కనాకష్టంగా మారిందని, నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకోవడానికి వీలు చిక్కడం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోలోపల మదనపడుతున్నారు.


శాఖలో ఏ సమస్యలున్నా సీఎంను కలిసి నివేదించుకోవడానికి అవకాశం లేకుండాపోయిందని అమాత్యులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్‌ రెడ్డి ఇకనుంచి ప్రతి శనివారం ప్రజా ప్రతినిధులతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా క్యాంపు కార్యాలయం అందుబాటులోకి రావడంతో ప్రజా ప్రతినిధులకు ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించాలని నిశ్చయించారు. ఎన్ని సమీక్షలు ఉన్నప్పటికీ ముఖాముఖి భేటీ అయి.. వారి సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్లస్‌ మార్కులే పడిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల్లో సానుకూలత సాధనకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరంతరం ప్రజలతో మమేకమయ్యే ప్రజా ప్రతినిధులను కలిస్తే.. ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని సీఎం భావన. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 10 , 2026 | 06:37 AM