Share News

రాజగోపురం 9 అంతస్తుల్లో..

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:34 AM

అక్షరాభ్యాసాలకు ఆలవాలమైన బాసర క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.225 కోట్ల నిధులు వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టనుంది.

రాజగోపురం 9 అంతస్తుల్లో..

  • 3 దిక్కుల్లో 7 అంతస్తుల్లో గోపురాలు.. అద్భుతంగా బాసర ఆలయ అభివృద్ధి

  • 20 వేల చదరపుటడుగుల నుంచి 67 వేల చ.అడుగులకు విస్తీర్ణం పెంపు

  • ఆలయ పునర్నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ

  • మనుమడికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించనున్న సీఎం

  • బోథ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పిప్రి గ్రామంలో బహిరంగ సభ

హైదరాబాద్‌/ఆదిలాబాద్‌/బాసర, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): అక్షరాభ్యాసాలకు ఆలవాలమైన బాసర క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.225 కోట్ల నిధులు వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టనుంది. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ చేయనున్నారు. జ్ఞాన సరస్వతిదేవి కొలువై ఉన్న క్షేత్రం కావడంతో ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చేవారితో ఆలయం రద్దీగా ఉంటుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా భక్తులు పెరుగుతుండగా.. ఆ మేరకు సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. బాసర ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు భక్తుల సంఖ్య, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. ఇందుకోసం ముందుగా శృంగేరి పీఠాధిపతులను సంప్రదించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగానే పునర్నిర్మాణ పనులకు మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. ప్రస్తుతం 2వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కులా మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణానికి అవతలి వైపున హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో ఆలయం వెనుక భాగంలో భారీ వృక్షాలు ఉండేలా మొక్కలను నాటనున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం బాసర తీరానికి రానున్నారు. వారికి అవసరమైన అన్నిరకాల వసతుల కల్పన పనులను కూడా ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లో చేర్చడంతో.. ఆ మేరకు పనులు చేపట్టనున్నారు.


ఇదీ స్థల పురాణం..

దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతిదేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం ప్రశాంతత కోసం వేదవ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట. ఆ సమయంలో ఆయనే స్వయంగా గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లను ప్రతిష్ఠించారనేది స్థల పురాణం. అలా ముగ్గురమ్మలు కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయ పునర్నిర్మాణంలో ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ద్యాన మందిరాలతో మరింతగా అభివృద్ధి చేయనున్నారు.

సీఎం రేవంత్‌ మనుమడికి అక్షరాభ్యాసం

బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో తన మనుమడికి అక్షరాభ్యాసం చేయించనున్నారు. బాసరలో కార్యక్రమాలు ముగిసిన వెంటనే సీఎం నేరుగా బోథ్‌ నియోజకవర్గంలోని ఇచ్చోడకు చేరుకుంటారు. ఈ మండలంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలకు, బోథ్‌ మండలంలోని పొచ్చెర వద్ద ఏటీసీ పిప్రి బుగ్గారం, తేజాపూర్‌, ముత్తునూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ చిక్మాన్‌ ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

Updated Date - Apr 06 , 2026 | 05:34 AM