Share News

మొదటి ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌’ సిద్ధం

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:21 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పైలట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ...

మొదటి ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌’ సిద్ధం

  • రేపు ఆరుట్లలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

మంచాల, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పైలట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో విద్యనందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌’ విధానాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన ఈ పాఠశాలను ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన అల్పాహార పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేయనున్నారు. ఆ తర్వాత టీపీఎ్‌సలో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలు, క్రీడాప్రాంగణం, కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలించి, సమీప క్రీడామైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సీపీ తరుణ్‌ జోషి, విద్యాకమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి తదితరులు సోమవారం పరిశీలించారు. మౌలిక సౌకర్యాలు, భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే రంగారెడ్డి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేపట్టిందని, అందులో భాగంగానే ఆరుట్ల నుంచి సరికొత్త విద్యావిప్లవానికి శ్రీకారం చుట్టుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూసిన వారే ప్రస్తుతం తమ పిల్లల అడ్మిషన్ల కోసం పోటీపడే పరిస్థితి వచ్చిందని, అదే కాంగ్రెస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. సీఎం బహిరంగ సభకు తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. విద్యాకమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యార్థులందరికీ అత్యుత్తమ విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా పాఠశాలలను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు.

Updated Date - Jun 16 , 2026 | 05:21 AM